విద్యుదాఘాతంతో మొక్కజొన్న దగ్ధం
గుంపెల్లగూడెంలో ఏడు ఎకరాల్లో తగలబడిన పంట
తట్టుకోలేక కుప్పకూలిన రైతు వీరన్న
కాకతీయ, కారేపల్లి: కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఇద్దరు రైతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. సింగరేణి మండలం గుంపెల్లగూడెం గ్రామ పరిధిలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు ఏడు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా బూడిదైంది. కళ్లముందే చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు గుండెనిరవిలా రోదిస్తున్నారు. గ్రామ సమీపంలోని పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గుగులోత్ వీరన్నకు చెందిన 6 ఎకరాల మొక్కజొన్న పంటతో పాటు, కుమ్మరి పాపారావుకు చెందిన ఒక ఎకరం పంట పూర్తిగా దగ్ధమైంది. మంటల తీవ్రతకు ఏమీ చేయలేక రైతులు నిస్సహాయంగా ఉండిపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే పంటంతా కాలిపోయింది. దాదాపు ఆరు ఎకరాల పంట కాలిపోవడాన్ని తట్టుకోలేక రైతు గుగులోత్ వీరన్న తీవ్ర ఆవేదనతో పొలంలోనే కుప్పకూలారు. గమనించిన తోటి రైతులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. పంట కోత దశలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ప్రమాద సమాచారం అందించినా స్థానిక గ్రామ పరిపాలన అధికారి స్పందించకపోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. కనీసం ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిన తమను ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

