కామేపల్లి పీహెచ్‌సీలో జిల్లా అధికారిణి తనిఖీ
వైద్య సేవలపై ఆరా తీసిన డాక్టర్ అరుణ దేవి
ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
కాకతీయ, కామేపల్లి: కామేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ అరుణ దేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, మందుల లభ్యతపై స్థానిక వైద్య అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హారిక, రంజిత్ కుమార్‌తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ఎదుర్కొంటున్న పలు సమస్యలను సిబ్బంది ఆమె దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, నాణ్యమైన సేవలందించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

