పిల్లల భవిష్యత్తుకు ‘బాల భరోసా’ రక్షణ కవచం
అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారం, మెరుగైన విద్య
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: మంత్రి కొండా సురేఖ
ఓసిటీ స్టేడియంలో ఘనంగా ‘బాల భరోసా’ వేడుకలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడం అత్యవసరమని, వారి రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండలోని ఓసిటీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ‘బాల భరోసా’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న ‘చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ – డ్రగ్స్‌కు నో’ థీమ్ వారం వేడుకల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అంగన్‌వాడీలను సద్వినియోగం చేసుకోవాలి..
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పిల్లల్లో శారీరక, మానసిక దృఢత్వానికి సరైన పోషణ ఎంతో అవసరమన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.
ఆరోగ్య పరీక్షలతో లోపాల గుర్తింపు: కలెక్టర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. చిన్నారులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఎదుగుదల లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వైద్య మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

