కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
లక్ష్మీపురం మార్కెట్లో మే డే వేడుకల్లో మంత్రి సురేఖ
జెండా ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : సమాజ నిర్మాణంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, వారి శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలోని లక్ష్మీపురం మార్కెట్లో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఎర్రజెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మికులకు అందాల్సిన బీమా ప్రయోజనాలు, వివిధ సంక్షేమ పథకాలు త్వరితగతిన చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మికుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.
అవగాహనతోనే అభివృద్ధి: కలెక్టర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. కార్మికుల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలపై కార్మికులు అవగాహన పెంచుకోవాలని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, 27వ డివిజన్ కార్పొరేటర్ అనిల్, వివిధ శాఖల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

