పంటను ఎందుకు కొనరు
నెల రోజులైనా కొనుగోళ్లు చేపట్టడం లేదు
గన్ని బ్యాగుల సరఫరాలో ఎడతెగని జాప్యం
ములుగు జిల్లాలో మొక్కజొన్న రైతుల నిరసన
మల్లంపల్లిలో జాతీయ రహదారిపై రాస్తారోకో
2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
అదనపు కలెక్టర్ హామీతో విరమించిన అన్నదాతలు
కాకతీయ, ములుగు ప్రతినిధి: మక్కల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా మల్లంపల్లిలో రైతులు శనివారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పంట కోత పూర్తై నెల రోజులు గడిచినా కొనుగోళ్లు చేపట్టకపోవడం, గన్ని బ్యాగుల సరఫరాలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచే రైతులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొనడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మల్లంపల్లి మండలంలోని రామచంద్రపురం వద్ద ప్రధాన కేంద్రం, పరిసర గ్రామాల్లో సబ్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ.. కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడిసిపోతే తీవ్రంగా నష్టపోతామని, నాణ్యత దెబ్బతింటే మద్దతు ధర రాదని వాపోయారు. ఇదే అదనుగా మధ్యవర్తులు తక్కువ ధరకే పంటను అడిగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఉపేందర్ రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది.
రెండు రోజుల్లో కొనుగోళ్లు..
ముగింపుగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో గన్ని బ్యాగులు, వాహనాలు అందుబాటులోకి తెచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన గట్టి హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. అనంతరం రైతు నాయకులు అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద నాయక్, మాచర్ల ప్రభాకర్, మొర్రి రాజు యాదవ్, గుండెబోయిన చంద్రయ్య, గోల్కొండ రాజు, బైకానీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

