3,600 ఎకరాలకు సాగునీరే లక్ష్యం
మర్రిపల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి
పూర్తయితే 10కి పైగా గ్రామాలకు ప్రయోజనం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
కాకతీయ, వేములవాడ: మర్రిపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన విప్.. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లంపల్లి నుంచి అందుతున్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా అనుసంధాన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. మర్రిపల్లి ప్రాజెక్ట్ పూర్తయితే కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 3,600 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీనివల్ల మల్లారం, నాగయ్యపల్లి, పోచెట్టిపల్లి, కొనయపల్లి, అచ్చన్నపేట సహా పలు గ్రామాలకు సాగునీటి కష్టాలు తప్పుతాయని వివరించారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం నిధులు సిద్ధంగా ఉన్నాయని, ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం..
నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, లచ్చపేట రిజర్వాయర్, ఎర్రచెరువుల అభివృద్ధి పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మర్రిపల్లిలో రైతు వేదిక, గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

