కొమ్మాల సంతలో చల్లని ‘సల్ల’ వితరణ
దాహార్తిని తీర్చుకున్న వేలాది మంది ప్రజలు
అల్లం బాల కిషోర్ రెడ్డి ఫౌండేషన్ చొరవ
కాకతీయ, గీసుగొండ: మండలంలో ఎండల తీవ్రత దృష్ట్యా అల్లం బాల కిషోర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం కొమ్మాల అంగడి ప్రాంగణంలో ఉచిత సల్ల (మజ్జిగ) వితరణ కార్యక్రమం నిర్వహించారు. అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, నాయకుడు అల్లం మర్రెడ్డి ప్రారంభించి, స్వయంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
వారంతపు సంత కావడంతో అంగడికి వచ్చిన వేలాది మంది రైతులు, పశువుల వ్యాపారులు, ప్రయాణికులు ఈ సల్ల వితరణతో తమ దాహార్తిని తీర్చుకున్నారు. సుమారు మూడు వేల మందికి పైగా మజ్జిగ పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎండలు మండిపోతున్న తరుణంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన యమునా ప్రవీణ్, దశ్రుతండ సర్పంచ్ కేలోతు అమృత బిక్షపతి, సూర్యతండ సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, మాజీ ఎంపీటీసీ బానోతు శ్రీనివాస్, నాయకులు మాదాసి రాంబాబు, సంపత్, వికాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

