వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రామీణ ప్రతిభకు వేదిక.. రాంపూర్‌లో హాకీ శిక్షణ శిబిరం
శిక్షణతోనే జాతీయ స్థాయికి క్రీడాకారులు
ప్రారంభించిన సర్పంచ్ సంగీత, గణేష్
కాకతీయ, హుజురాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని రాంపూర్ గ్రామ సర్పంచ్ ముషం సంగీత, గణేష్ పేర్కొన్నారు. సోమవారం హుజురాబాద్ మండలం రాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ హాకీ కోచ్ పల్లపు సాంబరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులకు సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి శిబిరాలు విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు. శిబిరంలో పాల్గొంటున్న బాలురు, బాలికలకు ప్రతిరోజూ హాకీలో ప్రాథమిక నైపుణ్యాలు, ఫిట్నెస్ మరియు ఆట నియమాలపై శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ సాంబరాజు వివరించారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం..
ఈ సందర్భంగా పలువురు దాతలు క్రీడాకారులకు అండగా నిలిచారు. మాటూరి సారయ్య జ్ఞాపకార్థం ఆయన మనవరాలు అవిజ్ఞ సుహాసిని 15 టీషర్ట్లను అందజేయగా, సీనియర్ క్రీడాకారుడు భూసారపు శంకర్ మరో 15 టీషర్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ కార్యదర్శి బొడిగ తిరుపతి, పీఈటీలు వేముల రవికుమార్, సాదుల శ్యామ్ కుమార్, సీనియర్ క్రీడాకారులు సజ్జు, రాజు, రాజేష్, సాయి కృష్ణ, ఉప సర్పంచ్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

