విధులకు గైర్హాజరు.. రికార్డు అసిస్టెంట్ సస్పెన్షన్
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాలు
మెమోలు ఇచ్చినా స్పందించని వైనం
కాకతీయ, పెద్దపల్లి: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పైఅధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్న కమాన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ కె. చిరంజీవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విధులకు గైర్హాజరు కావడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిరంజీవి విధులకు సక్రమంగా హాజరుకాకపోవడమే కాకుండా, ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించడం లేదు. అతని ప్రవర్తనపై వివరణ కోరుతూ జారీ చేసిన మెమోలను సైతం స్వీకరించకపోవడంతో క్రమశిక్షణారాహిత్యం స్పష్టమైందని పేర్కొన్నారు. దీనిపై కమాన్‌పూర్ తహసీల్దార్ సమర్పించిన నివేదిక ఆధారంగా శాఖాపరమైన విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఏపీ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనల ప్రకారం చిరంజీవిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను వీడరాదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

