చేతికొచ్చిన పంట బుగ్గి..
కన్నీరుమున్నీరవుతున్న రైతు
కాకతీయ, బోనకల్: మండల పరిధిలోని గోవిందపురం (ఎల్) గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఓ రైతు ఆశలు అడియాశలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించి, కుప్పగా పోసిన మొక్కజొన్న పంట నిప్పు రవ్వల ధాటికి పూర్తిగా బూడిదైంది. కళ్లముందే పంట దహనమవడంతో బాధితుడు ఎర్రబోయిన నాగేశ్వరరావు పొలంలోనే కుప్పకూలిపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బాధితుడి పొలం పక్కనే ఉన్న మరో రైతు తన పొలంలోని మొక్కజొన్న దంటును తగలబెట్టేందుకు నిప్పు పెట్టారు. అదే సమయంలో గాలి దుమారం వీయడంతో నిప్పురవ్వలు ఎగిరి నాగేశ్వరరావు పోసి ఉంచిన మొక్కజొన్న కుప్పపై పడ్డాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఎకరం రెండు కుంటల పొలంలో పండిన సుమారు 50 క్వింటాళ్ల మొక్కజొన్న పూర్తిగా కాలిపోయింది.
ప్రభుత్వం ఆదుకోవాలి..
లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టానని, తీరా పంట చేతికొచ్చే సమయంలో అగ్నిపాలవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని నాగేశ్వరరావు కన్నీరుమున్నీరయ్యారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట బూడిద పాలు కావడంతో కుటుంబం వీధిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి, జరిగిన నష్టాన్ని పరిశీలించి తమను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.

