‘విజయ్’ ముహూర్తం ఖరారు
తమిళనాట సరికొత్త చరిత్రకు సన్నద్ధం
రేపే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ సాధించిన విజయ్
వేడుకకు రాహుల్ గాంధీ సహా సినీ ప్రముఖులకు ఆహ్వానం
20 మంది సభ్యులతో కొలువుదీరనున్న నూతన కేబినెట్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతోంది. వెండితెరపై ‘ఇళయదళపతి’గా కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆయన, సంఖ్యాబలంపై సందిగ్ధత తొలగడంతో రేపు (శనివారం) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి అధికారాన్ని దక్కించుకోవడం తమిళ రాజకీయాల్లో ఒక అద్భుతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మద్దతు కూడగట్టిన టీవీకే.. స్పష్టమైన బలం
ఈ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒంటరిగానే బరిలోకి దిగి 108 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో పార్టీ సాంకేతిక బలం 107కి చేరింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విషయంలో తొలుత ఉత్కంఠ నెలకొంది. తాజాగా వీసీకే నేత తిరుమావళవన్ విజయ్ తో భేటీ అయ్యి మద్దతు ప్రకటించడంతో సంఖ్యాబలంపై స్పష్టత వచ్చింది. వీసీకే (2 స్థానాలు), సీపీఐ (2), సీపీఎం (2) స్థానాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ప్రకటించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 118 కి చేరుకోవడంతో గవర్నర్ నుంచి ఆహ్వానం లాంఛనంగా మారింది.
అతిథుల సమక్షంలో అట్టహాసంగా వేడుక
తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విజయ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరితో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్, పళనిస్వామిని కూడా ఆహ్వానించాలని టీవీకే నిర్ణయించింది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. సుమారు 20 మంది సభ్యులతో విజయ్ తన కేబినెట్ ను ఏర్పాటు చేయనున్నారు. మద్దతు ఇచ్చిన నాలుగు మిత్రపక్షాలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు సమాచారం. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల కోటను బద్ధలు కొట్టి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండటంతో దేశమంతా ఇప్పుడు తమిళనాడు వైపు ఆసక్తిగా చూస్తోంది.

