బెంగాల్ పీఠంపై.. ‘నందిగ్రామ్’ యోధుడు!
రేపు ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
రెండు స్థానాల్లో ఘనవిజయం.. మమతపై రెండోసారి గెలిచి రికార్డు
సామాన్య కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి..
మొత్తం ఆస్తులు ₹85.87 లక్షలు.. అప్పులు లేని నేత
కాకతీయ,నేషనల్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయం మొదలైంది. తూర్పు మేదినీపూర్ క్షేత్రస్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన సువేందు అధికారి, ఇప్పుడు బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్, భవానీపూర్ వంటి కీలక స్థానాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ అఖండ విజయం సాధించిన ఆయనను, బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రెండోసారి ఓడించి ‘జైంట్ కిల్లర్’గా పేరుగాంచిన సువేందు రేపు (శనివారం) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మున్సిపల్ కౌన్సిలర్ నుంచి సీఎం దాకా..
సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌లోని కర్కూలిలో జన్మించారు. మాజీ కేంద్ర సహాయ మంత్రి శిశిర్ కుమార్ అధికారి, గాయత్రీ అధికారిల కుమారుడైన ఆయన, 1990లో కాంగ్రెస్‌తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1995లో కాంతి మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన, అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. 2007-08 నాటి నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో భూమి ఉచ్ఛేద్ ప్రతిరోధ్ కమిటీకి నాయకత్వం వహించి, మమతా బెనర్జీని అధికారంలోకి తీసుకురావడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు. రెండుసార్లు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా కీలక శాఖలు నిర్వహించిన ఆయన, టీఎంసీలోని వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ 2020లో బీజేపీలో చేరారు. 2021లో నందిగ్రామ్ వేదికగా మమతా బెనర్జీపై 1,956 ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించి, శాసనసభ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలకు విధేయుడిగా ఉంటూ, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.
విద్యార్థి నుంచి ‘భూమిపుత్ర’ దాకా
తూర్పు మేదినీపూర్‌లోని కాంటాయ్ హైస్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన సువేందు, ప్రభాత్ కుమార్ కళాశాల నుండి బీఏ, రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందారు. నేతాజీ సుభాష్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. గ్రామీణ రాజకీయాల సంక్లిష్టతలను తెలిసిన నాయకుడిగా ఆయనకు “భూమిపుత్ర” అనే ఇమేజ్ ఉంది. రెండు స్థానాల్లో గెలిచి బలమైన రాజకీయ నేతగా ఎదిగిన ఆయన, ముఖ్యమంత్రిగా బెంగాల్‌ను ఏ దిశగా నడిపిస్తారోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
రూ. 85.87 లక్షల ఆస్తులు.. అప్పులు సున్నా
2026 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సువేందు అధికారి ఆర్థిక స్థితిగతులు చాలా పారదర్శకంగా ఉండటం గమనార్హం. ఆయన మొత్తం నికర ఆస్తి విలువ సుమారు ₹85.87 లక్షలుగా ఉంది.
చరాస్తులు: నగదు, బ్యాంక్ డిపాజిట్లు, పొదుపు పథకాల రూపంలో ₹20.72 లక్షలు ఉన్నాయి.
స్థిరాస్తులు: తూర్పు మేదినీపూర్‌లోని కర్కూలి ప్రాంతంలో ఉన్న పూర్వీకుల భూమి, నివాస భవనాల విలువ ₹65.15 లక్షలు.
ఆదాయం: 2024-25 ఐటీఆర్ ప్రకారం ఆయన వార్షిక ఆదాయం ₹17.38 లక్షలు.
విశేషమేమిటంటే ఆయనకు ఎటువంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అవివాహితుడైన సువేందు, తన పూర్తి సమయాన్ని రాజకీయ, సామాజిక సేవకే అంకితం చేశారు.

