పండని కాయ.. ‘పలారం’!
మామిడి ధరల్లో వ్యాపారుల మాయాజాలం
బేరంలో ఒక ధర.. దిగుమతి వేళ మరో ధర
వరంగల్ పండ్ల మార్కెట్లో దారుణ పరిస్థితులు
రైతులకు తప్పని ‘కమీషన్’ కోతలు
సీజన్ ప్రారంభంలో రూ.1.30 లక్షలు పలికిన క్వింటా
ఇప్పుడు రూ.70 వేలకే ‘జెండాపాట’
లక్ష రూపాయల సరుకుపై రూ.10 వేల కమీషన్
అడ్డూఅదుపు లేని మధ్యదళారుల దోపిడీ
అధికారుల పర్యవేక్షణ శూన్యం.. వ్యాపారుల కనుసన్నల్లోనే మార్కెట్ ధరలు
కాకతీయ, వరంగల్ : పండు కాయ పలారం అంటారు.. కానీ వరంగల్ పండ్ల మార్కెట్లో పండని మామిడి కాయలను ధరల రూపంలో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు పలారంలా పంచుకుతింటున్నారు. అడ్డగోలు ధరలతో రైతన్నకు చుక్కలు చూపిస్తున్నారు. పడరాని పాట్లు పడి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే, దళారులు చెప్పిన ధరకే తలొగ్గాల్సిన దుస్థితి నెలకొంది. సరుకు వెనక్కి తీసుకెళ్లలేక, వేరే మార్కెట్కు తరలించే స్తోమత లేక అన్నదాతలు అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీజన్ సాకుతో.. ధరలకు ‘కోత’
ఈ ఏడాది మార్చిలో మామిడి సీజన్ ప్రారంభమైనప్పుడు మార్కెట్ కళకళలాడింది. తొలి రోజుల్లో క్వింటా కాయ ధర రూ.1.30 లక్షల వరకు పలికింది. కానీ, ప్రస్తుతం సరుకు రాక పెరిగిందనే సాకుతో ధరను అమాంతం రూ.70 వేలకు తగ్గించేశారు. కాయ తెంపి మార్కెట్కు తరలించాలంటే ఒక్కో ట్రాలీకి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. ఈ క్రమంలో సరుకును తిరిగి తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో, కమీషన్ ఏజెంట్లు నిర్ణయించిన తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. ఏజెంట్లు చెప్పిందే రేటు.. పెట్టిందే సరుకు అన్నట్లుగా మార్కెట్లో పరిస్థితి తయారైంది.

వందకు పది.. అడ్తీదారుల జేబులు ‘నిండు’!
వరంగల్ మామిడి మార్కెట్లో ‘వందకు పది’ అనే సూత్రం అమలవుతోంది. అంటే వంద రూపాయల సరుకు అమ్ముడుపోతే, అందులో పది రూపాయలు కమీషన్ ఏజెంట్ల జేబులోకి వెళ్లాల్సిందే. లక్ష రూపాయల సరుకుపై ఏకంగా రూ.10 వేల కమీషన్ వసూలు చేస్తున్నారు. రోజుకు కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్న ఈ మార్కెట్లో కమీషన్ ఏజెంట్లు రోజుకు లక్షల్లో దండుకుంటున్నారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మార్కెట్ అధికారుల సమక్షంలో ధర నిర్ణయించాల్సి ఉండగా, ఇక్కడ కేవలం వాచ్మన్లు మాత్రమే కనిపిస్తున్నారు. అధికారులు లేకపోవడంతో దళారులదే రాజ్యమైంది.
దిగుమతి వేళ.. కొత్త కొర్రీలు!
ధర నిర్ణయం దగ్గర మొదలయ్యే దోపిడీ, సరుకు దిగుమతి అయ్యే వరకు కొనసాగుతూనే ఉంది. బేరం కుదిరిన తర్వాత సరుకును వ్యాపారులు దిగుమతి చేసుకునే సమయంలో కొత్త కొర్రీలు పెడుతున్నారు. కాయ పగిలిందనో, దెబ్బ తగిలిందనో, మరకలు ఉన్నాయనో సాకులు చెబుతూ.. కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు కోత విధిస్తున్నారు. అప్పటికే సరుకు అంతా దిగుమతి అయి ఉండటంతో, వ్యాపారులు చెప్పిన ‘తగ్గింపు’ ధరకు అంగీకరించక రైతులకు మరో మార్గం లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల కుమ్మక్కుతో మామిడి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్లో పారదర్శకత తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

