20 నుంచి ‘ములుగు సాంస్కృతిక వైభవం’
మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ వెల్లడి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈనెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ‘సాంస్కృతిక వైభవం’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉత్సవాల షెడ్యూల్, ఏర్పాట్లపై ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లా వైభవం చాటేలా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20, 21, 22 తేదీలలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం, జడ్పీ బాలుర, బాలికల పాఠశాల ఆవరణల్లో ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, గిరిజన నృత్యాలు, కవి సమ్మేళనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఉత్సవాల వేదికల వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
విభిన్న కార్యక్రమాల సమాహారం
స్థానిక రుచులతో కూడిన ఫుడ్ స్టాల్స్, హస్తకళల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

