ఖమ్మం అభివృద్ధి ప్రదాత తుమ్మల
రాష్ట్రంలోనే అవినీతి మచ్చలేని ఆదర్శ నేత
ఆత్మీయ సభలో ఎమ్మెల్యే కూనంనేని ప్రశంసలు
కాకతీయ, కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధిలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది చెరగని ముద్ర అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొనియాడారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ పంచాయతీ పరిధిలోని కమ్మ సత్రంలో నిర్వహించిన ‘తుమ్మల ఆత్మీయ సభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు తన 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 20 ఏళ్లకు పైగా మంత్రిగా ఉమ్మడి జిల్లాకు అసాధారణ సేవలు అందించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అవినీతి రహిత ఆదర్శ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. “ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తారు.. గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా ఎవరికైనా పనులు చేసి పెడతారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన రెండుసార్లూ ఆయన అందించిన సహకారం మరువలేనిది” అని కూనంనేని గుర్తుచేసుకున్నారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అరుదైన ఘనత ఆయనకే దక్కుతుందని, వామపక్షాలతో పొత్తు ధర్మానికి తుమ్మల ఎప్పుడూ పెద్దపీట వేస్తారని ప్రశంసించారు.
ఆయురారోగ్యాలతో ఉండాలి
మంత్రి తుమ్మల ఇంకా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ, ప్రజలకు సేవ చేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కూనంనేని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడు గణేష్, బిక్కసాని నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, వాసిరెడ్డి మురళి, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, మోత్కూరి ధర్మారావు, ఎం.వి. చౌదరి, యేర్ర కామేష్, గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.

