అన్నదాతలను ముంచుతున్న ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
చెల్పూర్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
కాకతీయ, భూపాలపల్లి : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను విస్మరించి అన్నదాతలను నిలువునా ముంచుతోందని భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కల్లాల్లో వడ్లు ఆరబోసి వారాల తరబడి రైతులు నిరీక్షిస్తున్నా, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అక్కడికక్కడే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన గండ్ర, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న అవస్థలను వివరించి తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఎటువంటి సాకులు చెప్పకుండా ప్రభుత్వ మద్దతు ధరతో ధాన్యాన్ని సేకరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

