కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం నిరసన
కూసుమంచిలో మోదీ దిష్టిబొమ్మ దహనం
తాడుతో ఆటోను లాగి వినూత్న నిరసన
పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలి : మల్లెల సన్మాతరావు
కాకతీయ , కూసుమంచి : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మాతరావు విమర్శించారు. ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి మండల కేంద్రం వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సన్మాతరావు మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ధరలు పెంచబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఫలితాలు రాగానే ఇంధన రేట్లను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, సీనియర్ నాయకులు శీలం గురుమూర్తి, పాలేరు డివిజన్ కమిటీ సభ్యులు బిక్కసాని గంగాధర్, హళావత్ నరసింహ, పార్టీ నాయకులు ఎల్లంపల్లి అశోక్, పడిశాల శేషయ్య, ఎర్రబోయిన సురేష్, జవ్వాజి శ్రీను, ఉప్పయ్య, ఉన్నం బాబురావు, నవీన్, వీరబాబు, వీరన్న, నాగేశ్వరరావు, ప్రసాద్, వెంకటేశ్వరరావు, వెంకటనారాయణ, శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

