టీఆర్ఎస్ మానుకోట జిల్లా ఇంచార్జ్‌గా శ్రీకాంత్ గౌడ్
కాకతీయ, మహబూబాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగల నిర్వహణ కోసం ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ జిల్లా, నియోజకవర్గాల ఇంచార్జీలను ఆ పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ ముఖ్య నాయకులతో కూడిన అధికారిక జాబితాను విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను నియమించారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలో ఉన్న ఆయన, పార్టీ కష్టసమయాల్లోనూ కల్వకుంట్ల కవితకు వెన్నంటి నిలిచారు. ఆయన చూపిన విధేయత, నిబద్ధతను గుర్తించిన అధిష్టానం, మానుకోట జిల్లా సారథ్య బాధ్యతలను శ్రీకాంత్ గౌడ్‌కు అప్పగించింది.
నియోజకవర్గాల వారీగా బాధ్యతలు
జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల ఇంచార్జీలను కూడా కవిత ప్రకటించారు. మహబూబాబాద్ (మానుకోట) నియోజకవర్గ ఇంచార్జ్‌గా పార్టీ సీనియర్ నాయకులు గంధసిరి వేణును, డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బోడ అనిల్ నాయక్‌ను నియమించారు. జిల్లాలోని ప్రతి పల్లెపల్లెనా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలా, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర, జిల్లా స్థాయి బాధ్యులు సమన్వయంతో పనిచేయాలని అధిష్టానం దిశానిర్దేశం చేసింది. తమపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, గంధసిరి వేణు, బోడ అనిల్ నాయక్ లు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

