నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రాధాన్యత
ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉండాలి
గిరిజన రైతులకు ప్రత్యేక సేవలందించాలి
రైతుల నష్టం చేసే వారిపై కఠిన చర్యలు
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మంత్రి సీతక్క హెచ్చరిక
కాకతీయ, ములుగు ప్రతినిధి : నాణ్యమైన విత్తనాలే రైతులకు అందించాలని, విత్తనాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్ల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వారిని నష్టపరిచే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విత్తన కంపెనీలు, డీలర్లు, ఆర్గనైజర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గతంలో కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. విత్తన చట్టం ప్రకారం అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేలా స్థానిక స్థాయిలో నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీలను కోరారు.
ముందస్తు ప్రణాళికలు అవసరం
వర్షాకాల వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పట్టాలు లేని రైతుల పరిస్థితిని ప్రత్యేకంగా గుర్తించి, వారికి కూడా వ్యవసాయ అవసరాలు అందేలా చూడాలని సూచించారు. గ్రామస్థాయిలో రైతులకు ప్రభుత్వ విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మండలాల వారీగా డీలర్లు, వ్యవసాయ అధికారులతో సమావేశాలు నిర్వహించి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మంత్రి సీతక్క అనంతరం జిల్లా ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న సీసీ రోడ్లు, మహిళా సంఘాల భవనాల నిర్మాణాలను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల భవనాల బిల్లుల అప్లోడ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి కేటాయించిన ప్రతి రూపాయి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

