వలలొచ్చిన ‘మృగశిర’ అదృష్టం
ఊకల్ చెరువులో 15 కిలోల భారీ మీనం
ఊకల్ హవేలీలో రెండు టన్నుల చేపల విక్రయం
కాకతీయ, గీసుగొండ : మృగశిర కార్తె ప్రారంభం కావడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను భారీ మీనం వరించింది. గీసుగొండ మండలంలోని ఊకల్ హవేలీ ఊర చెరువులో ఆదివారం మత్స్యకారులు వేట సాగించగా, ఊహించని విధంగా సుమారు 15 కిలోల బరువున్న భారీ చేప వలలో పడింది. మృగశిర కార్తె నేపథ్యంలో మార్కెట్లో చేపలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో జాలర్లు ఉదయాన్నే ప్రత్యేకంగా ఈ వేట చేపట్టారు. సాధారణంగా చెరువుల్లో ఇంత పెద్ద పరిమాణంలో చేపలు చిక్కడం అరుదని, కార్తె రోజే ఇలాంటి భారీ మీనం దొరకడం తమ అదృష్టమని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆ పెద్ద చేపను పట్టుకుని జాలర్లు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఊకల్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కొత్తగాటు కోటేశ్వర్ మాట్లాడుతూ.. మృగశిర కార్తె పురస్కరించుకుని చేపల విక్రయాలు జోరుగా సాగాయన్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు రెండు టన్నుల చేపలు అమ్ముడుపోయాయని వెల్లడించారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి చేపలను కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. ఊకల్ హవేలీ చెరువులో భారీ మీనం పడటం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

