జలమండలిలో భారీ కుంభకోణం
ప్రభుత్వ ఖజానాకు 6.50 కోట్ల గండి!
అదనపు చెల్లింపులతో అక్రమాలకు తెరలేపిన అధికారులు
ఎస్టీపీ17 ప్యాకేజి బిల్లుల్లో చేతివాటం ప్రదర్శన
మాజీ డైరెక్టర్ తిరస్కరించిన బిల్లును ఓవర్ రైట్ చేసి మరీ క్లెయిమ్
అశోక్ రెడ్డి, చంద్రజ్యోతి, నర్సింగ రావుల ప్రమేయంపై ఆరోపణలు
ఏజీ ఆడిట్ విభాగంలోనూ లంచాల ప్రలోభం
ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలమాస శ్రీకాంత్ గౌడ్ డిమాండ్
కాకతీయ, హైదరాబాద్ : ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షిస్తున్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పరిధిలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ)లో కోట్లాది రూపాయల అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, అధికారులు అడ్డగోలుగా నిధులు దారి మళ్లించినట్లు టీఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నలమాస శ్రీకాంత్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్‌టీపీ17 లోని మూడవ ప్యాకేజి కింద ప్రభుత్వం కేటాయించిన నిధుల వినియోగంలో భారీ అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఎస్టీపీ3 ప్యాకేజి పనులకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ఆడిట్ పూర్తి కాకుండానే, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించారు. అసలు 11.59 కోట్ల రూపాయల చెల్లింపులకు గాను, సుమారు 18 కోట్లు చెల్లించి దాదాపు 6.50 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును అవినీతిపరులు కాజేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడువులోగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు కేవలం 40 శాతం మాత్రమే చెల్లించి, మిగిలిన 60 శాతాన్ని ఈఎంఐరూపంలో చెల్లించాల్సి ఉంది. కానీ, అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డదారిలో ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు.
డైరెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఏజీ ఆడిట్‌లోనూ మేనేజింగ్
ఈ అక్రమ చెల్లింపులు జరిగిన సమయంలో అశోక్ రెడ్డి ఎండీ మరియు డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలోనే ఈ బిల్లును అప్పటి డైరెక్టర్ తిరస్కరించినప్పటికీ, అవే బిల్లులను మాజీ డైరెక్టర్ ఫైనాన్స్ సీల్ పైన జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) జి.ఎస్. చంద్రజ్యోతి తన సొంత సీలు వేసి, ఓవర్‌రైట్ రాసి మరీ క్లెయిమ్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారంలో డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌లోని సీనియర్ అధికారి బి. నర్సింగ రావు ప్రమేయం కూడా బలంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఈ అవినీతి బయటకు రాకుండా AG డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను కూడా లక్షల్లో లంచాలు ఇచ్చి మేనేజ్ చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఈ కుంభకోణం ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతోందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే అశోక్ రెడ్డి, జి.ఎస్. చంద్రజ్యోతి, బి. నర్సింగ రావులపై శాఖాపరమైన విచారణ చేపట్టి తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తోంది. పాత బిల్లుల చెల్లింపులపై, ముఖ్యంగా ఎస్టీపీ 17 మూడవ ప్యాకేజి బిల్లులపై తక్షణమే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, రాష్ట్ర రక్షణ సేన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


