ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు
37 మంది ప్రయాణికులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
ఎల్‌ఎండీ సమీపంలో పూర్తిగా దగ్ధమైన ఈ-బస్సు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీ సమీపానికి చేరుకోగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెనుక భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందే గుర్తించిన డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపివేశారు. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులను తక్షణమే సురక్షితంగా కిందికి దింపడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
క్షణాల్లో వ్యాపించిన మంటలు.. బస్సు పూర్తిగా దగ్ధం
ప్రయాణికులు కిందికి దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమించారు. అయితే అప్పటికే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కరీంనగర్–2 డిపోకు చెందిన ఈ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై రూపురేఖల్లేకుండా దగ్ధమైంది. ఈ అకస్మాత్తు ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే రాజీవ్ రహదారిపై ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆర్టీసీ అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో తలెత్తిన సాంకేతిక లోపమా లేక బ్యాటరీ సంబంధిత సమస్యల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే తమ ప్రాణాలు దక్కాయని ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

