మాతృత్వానికి మాయని మచ్చ
ఇద్దరు కొడుకులకు ఎలుకల మందు పెట్టి కడతేర్చిన తల్లి!
ఖమ్మం జిల్లా మునిగిన గుర్రాలపాడులో దారుణ ఘటన
సొంతూరికి వెళ్లిపోదామన్నందుకు భార్య ఘాతుకం
నిద్రలోనే కన్నుమూసిన పెద్ద కుమారుడు వేదక్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కుమారుడు తనీష్ మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఖమ్మం త్రీటౌన్ పోలీసులు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : పిల్లల ఆలనా పాలనా చూస్తూ, తన కడుపు మార్చుకొని బిడ్డల కడుపు నింపాల్సిన ఓ తల్లి.. కన్నప్రేమను మర్చిపోయి కసాయిగా మారింది. క్షణికావేశంలో ఆమె చేసిన ఘాతుకం ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న వివాదం చివరకు ఇద్దరు కొడుకులను పొట్టనబెట్టుకునేలా చేసింది. ఫాదర్స్ డే నాడే ఇద్దరు పిల్లలను కోల్పోయి ఆ తండ్రి పుట్టెడు శోకంలో మునిగిపోగా, యావత్ సభ్య సమాజం దిగ్బ్రాంతికి గురవుతోంది.
ఖమ్మం నుంచి సొంత ఊరికి వెళ్లే విషయంలో గొడవ
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏడో డివిజన్ గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బల లింగరాజు, స్వాతి దంపతులు గత కొన్ని నెలలుగా కుటుంబ అవసరాల నిమిత్తం ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. లింగరాజు అక్కడే స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ షాపులో వర్కర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం సదరు సెల్ పాయింట్ యజమాని.. షాప్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, తాను నడపలేనని చెబుతూ ప్రత్యామ్నాయ ఉద్యోగం చూసుకోవాలని లింగరాజుకు చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో.. లింగరాజు తన సొంత ఊరైన గుర్రాలపాడు వెళ్లి అక్కడ ఏదైనా పని చేసుకుని బతుకుదామని భార్యకు నచ్చజెప్పాడు. కానీ భార్య స్వాతి మాత్రం అందుకు నిరాకరించింది. మనం ఖమ్మంలోనే ఉండాలని పట్టుబట్టింది. ఈ విషయమై గత రెండు రోజులుగా భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరుగుతోంది.
బిస్కెట్లలో ఎలకల మందు కలిపి దారుణం
భర్త తన మాట వినడం లేదనే కోపంతో స్వాతి శనివారం సాయంత్రం దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లలో ఎలకల మందు కలిపి తినిపించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు భర్తకు ఫోన్ చేసి.. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని, త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. కంగారుగా ఇంటికి వచ్చిన లింగరాజు.. స్థానిక మెడికల్ షాప్లో సిరప్ తీసుకువచ్చి పిల్లలకు తాపించి పడుకోబెట్టాడు. అయితే విషప్రభావం ఎక్కువ కావడంతో పెద్ద కుమారుడు వేదక్ కుమార్ నిద్రలోనే కన్నుమూశాడు. అటు చిన్న కుమారుడికి తీవ్రంగా వాంతులు కావడంతో వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో చిన్న కుమారుడు తనీష్ కూడా మరణించాడు. ఫాదర్స్ డే నాడే ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గుర్రాలపాడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖమ్మం మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

