సీక్రెట్ ఒప్పందం బయటపెట్టాలి
తుగభద్ర నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం?
ముంచేసే ‘ముంపు మేస్త్రి’గా ముఖ్యమంత్రి
తెలంగాణ జలహక్కులపై సీఎంకు కనీస అవగాహన లేదు
రాజకీయ గురువుకు ‘గురుదక్షిణ’గా రాష్ట్ర జలప్రయోజనాల బలి
ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తెలంగాణ భవిష్యత్తు తాకట్టు
కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ‘నీరో చక్రవర్తి’లా రేవంత్ చోద్యం
కేసీఆర్ సాధించిన హక్కులను తాకట్టు పెడుతున్నారా?
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, ప్రాజెక్టులను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ముంచేసే ‘ముంపు మేస్త్రి’గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారారని, తన రాజకీయ గురువుకు ‘గురుదక్షిణ’ చెల్లించుకునే క్రమంలో రాష్ట్ర జలహక్కులను బలిపెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి అజ్ఞానం నేడు తెలంగాణకు మరణశాసనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేళ్ల పాటు పోరాడి సాధించిన ప్రాజెక్టుల అనుమతులను గాలికి వదిలేసి, తన రాజకీయ స్వార్థం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.
చీకటి ఒప్పందం వెనుక అసలేం జరిగింది?
కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం పూర్తిగా హాస్యాస్పదమని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని హరీశ్‌రావు విశ్లేషించారు. ఆ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మన రాష్ట్ర ఇంజనీర్లను లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు కేవలం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు మాత్రమే ఉన్న ఆ ‘సీక్రెట్ మీటింగ్’లో కుదిరిన అగ్రిమెంట్ ఏంటో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీతో బలమైన అనుబంధం ఉండి, చంద్రబాబు నాయుడు తనకున్న పలుకుబడితో కేంద్ర కార్యదర్శిగా నియమింపజేసుకున్న కాంతారావు సమక్షంలో జరిగిన ఈ చర్చలు తెలంగాణకు వ్యతిరేకమని ఆరోపించారు.
55 టీఎంసీల దోపిడీకి రెడ్ కార్పెట్
కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రకు దిగువన, ఆర్డీఎస్కు ఎగువన 35 టీఎంసీల సామర్థ్యంతో ‘నవేలి రిజర్వాయర్’ నిర్మాణానికి పూనుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ దిగువన, సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో ‘గుండ్రేవుల’ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని హరీశ్‌రావు వివరించారు. ఈ విధంగా ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ కలిసి మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో ఈ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించి కోల్డ్ స్టోరేజీలో పడేసిందని, నేడు ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే ఇవి మళ్లీ తెరపైకి వచ్చాయని మండిపడ్డారు. ఈ 55 టీఎంసీల నీటిని ఆపేస్తే అల్టిమేట్‌గా శ్రీశైలంకు నీరు రాదని, తద్వారా కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఎడారిగా మారుతాయని హెచ్చరించారు.
అవగాహన లేని సీఎం.. అభాసుపాలవుతున్న తెలంగాణ
దేవాదుల ప్రాజెక్టు ఏ దేశంలో ఉందో, నల్లమల ఏ రాష్ట్రంలో ఉందో తెలియని రేవంత్ రెడ్డికి నదీ జలాలపై అవగాహన అస్సలు లేదని, బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ మధ్య తేడా తెలియక గతంలోనే ఎన్నోసార్లు అభాసుపాలయ్యారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని చెబుతున్న రేవంత్, ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల వాటా సాధించారా? అని సూటిగా ప్రశ్నించారు. తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురుడి (2 టీఎంసీలు), చిక్కలపర్వి (2.5 టీఎంసీలు), చుక్కలమంచి (5 టీఎంసీలు) ప్రాజెక్టుల గురించి కనీసం ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదని, పైగా కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన ఇరిగేషన్ సెక్రటరీకి రాసిన లేఖలో “తెలంగాణ అభ్యంతరాలు చెప్పవద్దు, సైలెంట్‌గా ఉండండి” అని కోరితే, దానికి రేవంత్ సర్కార్ మౌనంగా ఉండి కుమ్మక్కయ్యిందని ఆరోపించారు.
నిర్ణయాత్మక అనుమతుల సాధనలో కాంగ్రెస్ వైఫల్యం
గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో గోదావరిలో 830 టీఎంసీలకు అనుమతులు సాధించామని, మరో 138 టీఎంసీలకు డీపీఆర్‌లు సమర్పించామని హరీశ్‌రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటివరకు కనీసం ఒక్క టీఎంసీకి కూడా కొత్త అనుమతులు సాధించలేదని ఎండగట్టారు. పెండింగ్‌లో ఉన్న సమ్మక్క సాగర్ (47 టీఎంసీలు), వాద్ర ప్రాజెక్టు (20 టీఎంసీలు), ఎల్లంపల్లి (30 టీఎంసీలు) డీపీఆర్‌లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్లే అవి వెనక్కి వచ్చాయని అన్నారు. నదుల అనుసంధానం జరగాలంటే ముందు తెలంగాణకు రావాల్సిన 968 టీఎంసీల నికర నీటి హక్కులను కేంద్రం ముందు గట్టిగా వాదించాలని, కానీ రేవంత్ రెడ్డి మన హక్కుల గురించి మాట్లాడకుండా ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్నారని మండిపడ్డారు.
హిట్లర్ స్ఫూర్తి.. నీరో చక్రవర్తి పాత్ర
హైడ్రా కూల్చివేతల విషయంలో ‘హిట్లర్’ స్ఫూర్తి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి, మన నీళ్లు తరలిపోతుంటే చోద్యం చూస్తున్న తీరు చూస్తే రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన ‘నీరో చక్రవర్తి’ గుర్తొస్తున్నాడని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డుల విషయంలో గత ఏడాది జూన్‌లో చంద్రబాబుకు 500 టీఎంసీల ఎన్వోసీ ఇస్తామని ఆఫర్ ఇచ్చి, సెప్టెంబర్‌లో 904 టీఎంసీలు సాధిస్తామని పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సంతకం పెట్టనని చెప్పి సంతకం పెట్టి, కమిటీ వేయమని చెప్పి కమిటీ వేసి ఏపీకి రెడ్ కార్పెట్ పరిచారని, ఇది చంద్రబాబుకు చేస్తున్న ‘గురుదక్షిణ’ కాదా? అని ప్రశ్నించారు.
ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం..
పాలమూరు-రంగారెడ్డికి ఎన్ఓసీ తెచ్చే పేరుతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టును బలిపెడుతున్నారని, ఇది వరంగల్, నల్గొండ జిల్లాల నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు చేస్తున్న ద్రోహమని హరీశ్‌రావు హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఈ కీలక అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని, ముగ్గురు సీఎంల సమావేశంలో మాట్లాడిన అంశాలను వెంటనే శాసనసభలో పెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు. “రేవంత్ రెడ్డి నువ్వు గుంపు మేస్త్రివి అయినా మాకు అభ్యంతరం లేదు కానీ, తెలంగాణను ముంచే ‘ముంపు మేస్త్రి’వి కావద్దు” అని గట్టిగా హెచ్చరించారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీరు తగ్గినా, ఎక్కడ రాజీ పడినా తెలంగాణ సమాజం క్షమించదని, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై ప్రజల్లోకి వెళ్లి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అజ్ఞానం, అవినీతి, గురువు పట్ల ఉన్న భక్తి వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, ట్రిబ్యునల్స్ ముందు బలమైన వాదనలు వినిపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

