మూసీని అడ్డుకుంటే తొక్కుతా
వాళ్లు కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం
ఈ విషయంపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి
పేదలకు సన్న బియ్యం ఇవ్వడం ప్రజాపాలనలో భాగమే
ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేస్తాం
పాపాల భైరవుడు రావాలా..? లేక ప్రజా పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలి
నల్గొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : మూసీ ప్రక్షాళన పనులను అడ్డుకుంటే మూసీలోనే వేసి తొక్కుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి హెచ్చరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిందని, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వంద ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించిందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆరు వేల మూడు వందల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ.. గడీల పాలన కోసం త్యాగాలు చేశామని చెప్పే బీఆర్ఎస్ నేతలను ముఖ్యమంత్రి ఎండగట్టారు. పదవుల కోసం రాజీనామాలు చేయడం, ఎన్నికలు తీసుకురావడం, కాంట్రాక్టుల కోసం కమీషన్లు వసూలు చేసుకోవడమేనా త్యాగమని ఆయన నిలదీశారు. అమరవీరుల బలిదానాల పైన అధికారంలోకి వచ్చి, ప్రజల రక్తాన్ని పీల్చిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. అగ్గిపెట్టె కొనేందుకు పది పైసలు లేని వారు ఇప్పుడు వేల కోట్ల ఫామ్ హౌస్‌లు ఎలా కట్టుకున్నారని ఆయన నిలదీశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాస్తా కూలేశ్వరంగా మారిందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు కూలిపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం వైఫల్యంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అప్పటి పాలకులదేనని ఆయన స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన ఈ రాష్ట్రంలో, అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం పనిచేసిన పాలకులకు అధికారం కోల్పోయిన తర్వాత వస్తున్న కడుపు మంట బయటపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.


పేదవాడి కడుపు నింపడమే ప్రజాపాలన
గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలన, పన్నెండు ఏళ్ల బీజేపీ పాలన, మరియు తమ రెండున్నరేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి సవాలు విసిరారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతిపక్షాల మ్యానిఫెస్టోలను, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలను పరిశీలిద్దామని, ఎవరు ఏం చేశారో ప్రజల సాక్షిగా అసెంబ్లీలోనే తేల్చుకుందామని సవాలు చేశారు. నిజాయితీ ఉంటే చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. గడిచిన పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్, నేడు తాము లక్షలాది కార్డులు ఇస్తుంటే ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. పేదవాడి కడుపు నింపడమే లక్ష్యంగా తాము సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇది పేదల ఆత్మగౌరవానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చెప్పారు. ఫామ్ హౌస్‌లో పడుకున్న కేసీఆర్, జన్వాడలో ఉన్న కేటీఆర్, శంకర్ రెడ్డి పల్లిలో ఉన్న కవిత తింటున్న బియ్యాన్నే, పేదల పిల్లలకు కూడా అందించాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, అది వారి కళ్లలో ఆనందం చూస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేశామని, దశాబ్ద కాలంగా ఇంటి కోసం ఎదురుచూస్తున్న వారికి తమ ప్రభుత్వం భరోసా ఇస్తోందని చెప్పారు.
మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతా
నల్గొండ ఆడబిడ్డలకు మూసీ కాలుష్యం వల్ల ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ, ఆ మురికిని తొలగించడమే తన బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత పాలకులు పదేళ్లుగా పడకేసిన ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్గొండకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గడిచిన రెండున్నరేళ్లలో డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడామని తెలిపారు. బిల్లా రంగాలు, మారీచులు ఊరూరా తిరిగి అబద్ధాలు చెపుతున్నారని, ఫామ్ హౌస్‌లో కూర్చున్న శుక్రాచార్యుడు, ఊరూరు తిరుగుతున్న సుభావుడు నిజం మాట్లాడటం లేదని విమర్శించారు. సింగరేణిని కొల్లగొట్టారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, అసలు సింగరేణిని కొల్లగొట్టింది ఎవరనేది ప్రజలకు తెలుసని అన్నారు. ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని వంద ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిన వారికి, అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తామని, మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని, ఇది నా ఒట్టు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్త్సపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పేదల సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజా పాలనను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

