వరంగల్ సీపీగా శ్వేత
సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగానికి సన్‌ప్రీత్ సింగ్ బదిలీ
నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
చారిత్రక నగరం రక్షణ బాధ్యతలు 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణికి
సిద్దిపేట తొలి మహిళా ఎస్పీగా, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా పనిచేసిన అనుభవం
నూతన సీపీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు బాధ్యతలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : చారిత్రక ఓరుగల్లు మహానగర పోలీస్ కమిషనర్‌గా భారత పోలీసు సేవ (ఐపీఎస్) అధికారిణి ఎన్. శ్వేత నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాల్లో భాగంగా ఆమెను వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సన్‌ప్రీత్ సింగ్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయ్యారు. నగర పోలీసింగ్‌లో విస్తృత అనుభవం కలిగిన శ్వేత వరంగల్ కమిషనరేట్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో పోలీసు శాఖలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
కీలక బాధ్యతల్లో సమర్థవంతమైన పనితీరు
2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి ఎన్. శ్వేత తన సేవాకాలంలో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉత్తమ అధికారిణిగా మంచి గుర్తింపు పొందారు. గతంలో సిద్దిపేట జిల్లా తొలి మహిళా ఎస్పీగా సేవలందించిన ఆమె, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు చేరువైన ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ విశేష ప్రశంసలు అందుకున్నారు. అనంతరం హైదరాబాద్ ఉత్తర మండల డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ)గా పనిచేస్తూ నేర నియంత్రణ, మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజలతో నిరంతర సమన్వయం వంటి అంశాల్లో అత్యంత సమర్థవంతమైన పనితీరును కనబరిచారు. తాజా బదిలీల్లో భాగంగా వరంగల్ సీపీ బాధ్యతలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అదనపు బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అప్పగించింది.
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణే లక్ష్యం
విద్య, వైద్యం, వాణిజ్య, చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, పాత నేరాల నియంత్రణ, మహిళల భద్రత, వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారం వంటి ప్రధాన అంశాలపై నూతన కమిషనర్ ప్రత్యేక దృష్టి సారిస్తారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఎన్. శ్వేత రాకతో ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండే పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నేర నియంత్రణ వ్యవస్థ బలోపేతం కానుందని, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే చర్యలు ముమ్మరం కానున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నగర పౌరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

