మంత్రి తుమ్మలకు మచ్చ తెచ్చే పని
40ఏళ్ల మంత్రి అనుభవాన్ని గుర్తించేలా పైలాన్ నిర్మాణానికి యత్నం
అయితే పీవీ విగ్రహానికి సమీపంలో ఏర్పాటు యత్నాలపై ఖమ్మంలో నెగటివ్ టాక్
పీవీ నరసింహారావు కుమార్తె ఫిర్యాదుతో కదిలిన కలెక్టర్
విషయం తెలుసుకుని అనుచరులు, ముఖ్య నేతపై అమాత్యుడి సీరియస్
పీవీలాంటి మహోన్నత వ్యక్తిని తక్కువ చేసే పనులు చేయడంపై మండిపాటు
తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ముందుకెళ్లడంపై ఆగ్రహం
స్తూపం పనులు తక్షణమే నిలిపేయాలని కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలు
అత్యుత్సాహంతో నెగటివ్ టాక్ వచ్చేలా చేసిన ముఖ్య నేత, ఆయన అనుచరులు
అప్రమత్తమైన మంత్రి.. హంగు ఆర్భాటాలు ఆపేయాలని ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, మచ్చలేని ఇమేజ్ ఉన్న నాయకులను సైతం ఒక్కోసారి అనుచరుల అత్యుత్సాహం వివాదాల్లోకి నెడుతుంది. ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న లకారం ట్యాంక్ బండ్ జంక్షన్ సాక్షిగా సరిగ్గా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని, అనుభవాన్ని గుర్తిస్తూ కొందరు ముఖ్య అనుచరులు తలపెట్టిన ‘పైలాన్’ (స్తూపం) నిర్మాణం.. చివరకు ఆయనకే మచ్చ తెచ్చేలా మారడంతో అమాత్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన మంత్రి, తక్షణమే ఆ పనులను నిలిపివేయించి వివాదానికి తెరదించారు.
పీవీ విగ్రహం వద్ద పైలాన్.. ఖమ్మంలో వ్యతిరేకత!
లకారం ట్యాంక్ బండ్ జంక్షన్ లో దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం వెనుక భాగంలో ఒక పైలాన్ నిర్మాణాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు చకచకా ప్రారంభించారు. ఈ నిర్మాణానికి అడ్డుగా ఉందనే సాకుతో అక్కడ ఎంతో కాలంగా ఉన్న ఒక పచ్చని చెట్టును సైతం నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నారు. మున్సిపల్ అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఈ పనుల్లో వేగం పెంచారు. అయితే, పీవీ లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం ఉన్న ప్రాంతంలో దానికి సమీపంలోనే ఈ పైలాన్ ఏర్పాటుకు యత్నించడంపై ఖమ్మం నగర ప్రజల్లో తీవ్రమైన ‘నెగటివ్ టాక్’ వ్యక్తమైంది.
కలెక్టర్‌కు పీవీ కుమార్తె ఫిర్యాదు..
చారిత్రక విగ్రహం ప్రాధాన్యతను తగ్గించేలా సాగుతున్న ఈ నిర్మాణ వ్యవహారాన్ని స్థానికులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె తక్షణమే స్పందించి ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్.. ఈ విషయాన్ని వెంటనే మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. తన పర్యవేక్షణలో ఉండే నగరంలో.. తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఇలాంటి అనాలోచిత పనులు సాగడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి, సదరు పైలాన్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి, అక్కడి నుంచి ఆ శిథిలాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దేశానికి ఎనలేని సేవలందించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి మహోన్నత వ్యక్తిని కించపరిచే విధంగా లేదా తక్కువ చేసే విధంగా ఎలాంటి చర్యలు ఉన్నా సహించేది లేదని స్పష్టం చేశారు. అత్యుత్సాహంతో పార్టీకి, తనకు నెగటివ్ టాక్ వచ్చేలా ప్రవర్తించిన ఓ ముఖ్య నేతపై, ఆయన అనుచరులపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. కార్యకర్తలు ప్రచార ఆర్భాటాలు, హంగులు మానుకుని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని గట్టిగా హెచ్చరించారు. మంత్రి సుదీర్ఘ రాజకీయ జీవితానికి మరకలంటించేలా వ్యవహరించిన ఆ ముఖ్య నేత ఎవరనే చర్చ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ప్రభుత్వ పెద్దల మధ్య కూడా హాట్ టాపిక్‌గా మారింది.

