హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు
భూ తగాదాలో బంధువును చంపిన కేసులో నేరం రుజువు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నిందితులకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 6000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ బుధవారం తీర్పు వెల్లడించారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మీడియాకు వెల్లడించారు. ముస్తాబాద్ మండలం బద్నకల్ గ్రామానికి చెందిన కస్తూరి రాంరెడ్డి, కస్తూరి కరుణాకర్ రెడ్డి మధ్య వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో తరచూ వివాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో రాంరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కరుణాకర్ రెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించాడు. 2020 డిసెంబర్ 27న కరుణాకర్ రెడ్డి తన పొలంలో పని చేస్తుండగా.. రాంరెడ్డి, అతని భార్య మంజుల, కుమారులు వెంకటేశ్, మహేష్ కలిసి గొడ్డలి, కట్టెలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
సాక్ష్యాలతో నేరం రుజువు..
మృతుడి సోదరి పద్మ ఫిర్యాదుతో ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ ఉపేందర్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ 14 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితులకు జీవిత ఖైదు విధించింది. నేరం చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎస్పీ మహేష్ బి. గితే పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీలు పెంట శ్రీనివాస్, అశ్విన్, సీఐలు, ఎస్సైలు మరియు కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

