కవితను చంపేందుకు కుట్ర
టీఆర్ఎస్ నేతల సంచలన ఆరోపణలు
అరెస్ట్ సందర్భంగా పోలీసుల ఓవరాక్షన్‌పై విచారణ చేపట్టాలి
బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
ఉద్యమాలను నీరుగార్చేలా ‘గుంపు మేస్త్రీ’, ‘గుంటనక్క’ కుమ్మక్కు
టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్, చిలుక ప్రవీణ్
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను అంతం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్, చిలుక ప్రవీణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా పోరాటాలను అణచివేసే క్రమంలో ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోందని, కవిత అరెస్ట్ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్రలోనూ ఇలాంటి దుర్మార్గం లేదు: రూప్ సింగ్
ఉద్యమకారుల కోసం పోరాడుతున్న కవిత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమని రూప్ సింగ్ అన్నారు. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇంతటి దుర్మార్గం జరగలేదని ఆయన విమర్శించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందునే కవితను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఒక మహిళ, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా అమానుషంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల మద్దతుతో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిష్పాక్షిక విచారణ జరపాలి: ఇస్మాయిల్
కవితను అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే, ఆమెను చంపే కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని ఇస్మాయిల్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిని గతంలో అణచివేసిన పాలకులు ప్రజల చేతిలో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని సైతం ఉద్యమకారులను పట్టించుకోలేదనే కారణంతో ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు రేవంత్ సర్కార్ అదే బాటలో నడుస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు: చిలుక ప్రవీణ్
కవిత ప్రజా సమస్యలపై పోరాటం చేపట్టిన ప్రతిసారీ ‘గుంపు మేస్త్రీ’, ‘గుంటనక్క’ కుమ్మక్కై ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని చిలుక ప్రవీణ్ ఆరోపించారు. అసెంబ్లీలో జరగాల్సిన చర్చలను గాలికి వదిలేసి, గాల్లో కత్తులు తిప్పుకుంటూ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కవిత ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటాన్ని చూసి ఓర్వలేకనే రేవంత్ ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడుతోందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల అధికారం అనుభవించి ఉద్యమకారులకు అన్యాయం చేశారని, ఇప్పుడు కవిత చేస్తున్న పోరాటాన్ని కూడా అడ్డుకోవడం దారుణమని ప్రవీణ్ వ్యాఖ్యానించారు.

