క్వారీ ఇస్తానని చీట్ చేశారు
రూ.38 లక్షలు వసూలు చేసి..పోలీసులతో వేధింపులు
“నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా.. మానవత్వం చూపడం లేదు
సాక్ష్యాలు ఉన్నా ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదు
ఇసుక సబ్ కాంట్రాక్టర్ భాస్కర్‌రావు సంచలన ఆరోపణలు
పైడాకుల అశోక్, ములుగు ఎస్పీలపై హెచ్చార్సీలో, ఐజీకి ఫిర్యాదు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : “నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా.. కనీస మానవత్వం చూపడం లేదు. ఇసుక క్వారీలు ఇప్పిస్తామని నమ్మించి నా జీవితాన్ని, ఆస్తులను, ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ములుగు జిల్లాలో ఇసుక మాఫియా నడుపుతున్న ఈ అక్రమార్కులు ఇప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకుని నన్ను వేధిస్తున్నారు. రాజకీయ పలుకుబడితో నా గొంతు నొక్కాలని చూస్తున్నారు” అంటూ ఇసుక సబ్‌కాంట్రాక్టర్ బెల్లకొండ వెంకటేశ్వరరావు అలియాస్ భాస్కర్‌రావు కన్నీటి పర్యంతమయ్యారు. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గిరిజన సంఘాల నేతలపై డయాలిసిస్ పేషెంట్, ఇసుక సబ్ కాంట్రాక్టర్ బెల్లకొండ వెంకటేశ్వరరావు అలియాస్ భాస్కర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలో ఉపాధి హామీ ద్వారా ప్రారంభించిన ఇసుక క్వారీల సబ్‌కాంట్రాక్ట్ ఇస్తామని నమ్మించి రూ.38 లక్షల నగదుతో పాటు కోట్ల రూపాయలు ఖర్చు చేయించారని, చివరకు మాట తప్పి రాజకీయ పలుకుబడితో పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈమేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, చుంచులక్ష్మి ట్రైబల్ సొసైటీ అధ్యక్షుడు కోరం అబ్బయ్య, నరసింహస్వామి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పూస కార్తీక్, రామక్కపేటకు చెందిన కొండం బాలకృష్ణతో పాటు ములుగు జిల్లా ఎస్పీ, పస్రా సీఐ, మంగపేట ఎస్ఐలను ప్రతివాదులుగా పేర్కొంటూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.
నిలువునా ముంచారు..!
మల్టీజోన్ ఐజీకి..లీగల్ నోటీసు,హెచ్ ఆర్సీకి భాస్కర్‌రావు అందజేసిన వివరాల ప్రకారం.. ఆయన మాటల్లోనే.. 2010లో కోరం అబ్బయ్య తనను సంప్రదించి చుంచులక్ష్మి ట్రైబల్ సొసైటీకి ఇసుక క్వారీ సబ్‌కాంట్రాక్ట్ ఇప్పిస్తామని అగ్రిమెంట్ రాసి ఇచ్చి సొసైటీ రిజిస్ట్రేషన్, 360 మంది గిరిజన సభ్యులకు బ్యాంకు ఖాతాలు తెరవడం, చలానాలు చెల్లించడం, అప్పటి టీజీఎండీసీ, గనుల శాఖ అధికారుల వద్ద అనుమతుల కోసం రెండేళ్ల పాటు తిరుగుతూ రూ.8 లక్షలకు పైగా ఖర్చు చేశారు. అయితే క్వారీ అనుమతులు రాగానే ఎక్కువ డబ్బుల కోసం ఇతరులకు సబ్‌కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకున్నారు. 2018లో తన ఇంటికి వచ్చి ఒప్పందం చేసుకుని క్వారీ అనుమతుల తీసుకునే బాధ్యత అప్పగించారు. అప్పుడు మూడేళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి అనుమతులు తీసుకొచ్చినప్పటికీ అప్పటి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ బెదిరించి క్వారీలను తన అనుచరులకు ఇప్పించుకున్నారు. తనను ఆ ప్రాంతంలోకి రావొద్దని హెచ్చరించారు. ఆ మానసిక వేదనతో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రస్తుతం డే బై డే డయాలసిస్ చేయించుకునే పరిస్థితికి చేరుకున్నానని భాస్కర్ రావు ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.
2024లో మరోసారి ఒప్పందం..!
2023లో మళ్లీ సొసైటీ ప్రతినిధులు తనను సంప్రదించగా, 2024లో చుంచులక్ష్మి, నరసింహస్వామి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలతో మరోసారి ఒప్పందం కుదిరింది. మోసం జరగకుండా ఉండేందుకు కొండం బాలకృష్ణ ద్వారా ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ను కలిశాను. తన ఆరోగ్య పరిస్థితిని చూసిన అశోక్ రెండు ఇసుక క్వారీ పాయింట్లు (6, 10) ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాలకృష్ణ, కోరం అబ్బయ్య, పూస కార్తీక్‌లకు బ్యాంకు లావాదేవీల ద్వారా నేరుగా భారీ మొత్తంలొ డబ్బులు ఇవ్వడంతో పాటు గ్రామసభల నిర్వహణకు కూడా ఖర్చు చేశాను. అయితే ఆ రెండు క్వారీలను సందీప్ అనే వ్యక్తికి కేటాయించారని తెలిసిన తరువాత వారిని ప్రశ్నించగా, తనకు 7, 9 పాయింట్లు ఇప్పిస్తామని, ఇందుకు నిధులు అవసరమని చెప్పి మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. ములుగు కలెక్టరేట్ ఎదుట కొండం బాలకృష్ణకు రూ.38 లక్షలు నగదు అందజేశానని, డబ్బు తీసుకున్న తర్వాత అతడు ఫోన్‌కు స్పందించడం మానేశాడు. కోరం అబ్బయ్యను నిలదీయగా డబ్బు తీసుకున్న విషయాన్ని లిఖితపూర్వకంగా అంగీకరించారు. ఈ వ్యవహారాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా తన వాయిస్ రికార్డింగ్‌లను వాట్సాప్‌లో వైరల్ చేసి, పోలీస్ స్టేషన్‌లో తనపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. జూన్ 14, 2026న ములుగు ఎస్పీ, ఏఎస్పీ, సీఐ, ఎస్ఐలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. తాజాగా తనను రాజకీయ ఒత్తిడితో పస్రా సీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారు. తన వద్ద బ్యాంకు లావాదేవీలు, ఒప్పంద పత్రాలు, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని పేర్కొంటూ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరినట్లు భాస్కర్‌రావు తెలిపారు.
ఐజీకి ఫిర్యాదు…
మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించక ముందు కూడా భాస్కర్ రావు మల్టీజోన్ ఐజీకి కూడా పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించిన ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. చుంచుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ సొసైటీ ఇసుక రీచుల కారణంగానే తాను అనారోగ్యం పాలయ్యానని, ఆస్తులు అమ్మకుని దీనవాస్థకు చేరుకున్నానని ఆవేదనతో తెలిపారు.
లీగల్ నోటీస్…
చుంచుపల్లి ఇసుక రీచుల విషయంలో తనతో అగ్రిమెంట్ చేసుకుని ఇతరులకు రీచులను అప్పగించిన విషయంపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ ఎండీ కార్యాలయానికి కూడా భాస్కర్ రావు లీగల్ నోటీసులు పంపించారు. సదరు క్వారీలకు ఇవ్వాల్సిన బిల్లులు మంజూరు చేయవద్దని ఆయన అభ్యర్థించారు.

