వసతి గృహంలో విద్యార్థినుల గోస
అందని తాగునీరు.. మెనూ ప్రకారం లేని భోజనం
అందుబాటులో లేని వార్డెన్.. పట్టించుకోని అధికారులు
సమస్యల పరిష్కారం కోసం విద్యార్థినుల కన్నీటి విన్నపం
కాకతీయ, టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గోలియా తండా గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు లేక విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతున్నారని సమాచారం. వసతి గృహంలో తాగునీటి సౌకర్యం సరిగా లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. స్నానానికి కూడా నీరు అందుబాటులో ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందడం లేదని, తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు ఆరోపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
హాస్టల్ వార్డెన్ తరచుగా అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను వినేవారు ఎవరూ లేకుండా పోయారని విద్యార్థినులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, హాస్టల్‌ను తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని వారు కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా అధికారులు తక్షణమే హాస్టల్లో తాగునీరు, పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం మరియు ప్రభుత్వ మెనూ అమలు వంటి అంశాలపై దృష్టి సారించి, విద్యార్థినుల కష్టాలను తీర్చాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

