సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
1,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం, జగన్నాధపురంలో నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’కు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి, భద్రతా ప్రమాణాలు, సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలతో పాటు ముఖ్యమైన కీలక ప్రదేశాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సీపీ స్వయంగా సమీక్షించారు. ఈ పర్యటన కోసం సుమారు 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించామని, కేటాయించిన బాధ్యతలను ఎక్కడా లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.

ట్రాఫిక్ నియంత్రణ, మర్యాదపూర్వక ప్రవర్తన
విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ భద్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ కోరారు. ముఖ్యంగా ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, భద్రతా చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అడిషనల్ డీసీపీలు: 04, ఏసీపీలు: 12, సీఐలు, ఆర్సీఐలు: 58 ఎస్సైలు, ఆర్ఎస్సైలు: 151 ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు: 1,300 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు సారంగపాణి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

