- రోడ్డు ప్రమాదంలోనే నేను కన్ను కోల్పోయాను
- నా అంగవైకల్యాన్ని ఎద్దేవా చేయడం సిగ్గుచేటు
- ముగ్గురు మంత్రులు కలిసి ఆరు కళ్లతో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి
- హామీల అమలుపై సీఎం డొంకతిరుగుడు మాటలు
- నీటి పారుదల ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..రైతులకు ద్రోహం
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్
కాకతీయ, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాదం పేరుతో నిర్వహించిన సభలో తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. శనివారం మమత ఆసుపత్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే కించపరిచారని, ఇప్పుడు కూడా తన అంగవైకల్యాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో తాను కన్ను కోల్పోయానని, ఆ ఒక్క కన్నుతోనే గతంలో మంత్రిగా ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంత కృషి చేశానో ప్రజలకు తెలుసని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఆరు కళ్లతో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని పువ్వాడ సవాల్ విసిరారు.
హామీల అమలుపై డొంకతిరుగుడు మాటలు
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విషయ పరిజ్ఞానం లేకుండా కన్ను లేదని, పన్ను లేదని దిగజారి మాట్లాడటం సరికాదని అజయ్ కుమార్ హితవు పలికారు. కేవలం వ్యక్తిగత విమర్శలతో తాత్కాలికంగా సంతృప్తి చెందవచ్చు కానీ, అది ఎల్లకాలం ఉండదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదని, రైతు రుణమాఫీ విషయంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి రైతులను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. రైతు భరోసాను మూడు సీజన్ల పాటు ఎగవేసిన ప్రభుత్వం, ఇప్పుడు డొంకతిరుగుడు మాటలతో ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు.
నీటి పారుదల ప్రాజెక్టులపట్ల నిర్లక్ష్యం
కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు కోసం రూ. 9 వేల కోట్లు ఖర్చు చేశామని, ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి ఇప్పుడు తామే తెచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పువ్వాడ ఎద్దేవా చేశారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలపాలని ఏ నాయకుడు చేయని విధంగా కేసీఆర్ కృషి చేశారని, కానీ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలపై కనీస చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీటిని తరలించుకుపోతుంటే, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుండాల కృష్ణ, కూరకుల నాగభూషణం, పగడాల నాగరాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.

