అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి
ప్రాజెక్టుల పరిశీలనకు అవాంతరాలు ఎదురు కావొద్దు
మంత్రుల పర్యటనపై కలెక్టర్ అంకిత్ సమీక్ష
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిశీలనలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను తనిఖీ చేసిన ఆయన, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. హెలికాప్టర్ దిగడానికి అవసరమైన భద్రత, బారికేడింగ్, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సమగ్ర ఏర్పాట్లు చేయాలి
అమ్మగారిపల్లిలో నిర్వహించే సమీక్షా సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారుల సీటింగ్, మీడియా సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్ మరియు ట్రాఫిక్ నియంత్రణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో అశ్వాపురం తహసీల్దార్ సూర్యప్రకాష్, నీటి పారుదల మరియు రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

