అక్రమ మట్టి రవాణా.. జేసీబీ, రెండు ట్రాక్టర్ల సీజ్
డ్రైవర్లపై కేసు నమోదు చేసిన గీసుగొండ పోలీసులు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ విశ్వేశ్వర్
కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఊకల్ హవేలీ గ్రామ శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఒక జేసీబీ మరియు రెండు ట్రాక్టర్లను గీసుగొండ పోలీసులు గురువారం సీజ్ చేశారు. ఈ మేరకు సీఐ విశ్వేశ్వర్ వివరాలను వెల్లడించారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా మట్టిని తరలించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

