రేవంత్ వర్సెస్ ఉత్తమ్
సివిల్ సప్లైలో సీనియర్ ఎమ్మెల్యే చిచ్చు?
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాఖపై కన్నేసిన నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధి
మంత్రివర్గ పునర్విభజనలో బెర్త్ కోసం ప్రయత్నాలు
సీనియర్ మంత్రి శాఖలో లోసుగులపై సీఎంకు ఫిర్యాదులు
మంత్రికి తెలియకుండానే సీఎంవో నుంచి అధికారులకు వెళ్తున్న ఆదేశాలు?
ఇటీవల మిల్లర్లపై విజిలెన్స్ దాడులపై మంత్రి ఉత్తమ్ అసహనం
సీఎం రేవంత్ రెడ్డిపైనా ఉత్తమ్ అసంతృప్తి..?!
ఏఐసీసీ నేతలకు చేరిన ఫిర్యాదులు
తనను డిమోరలైజ్ చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన
పార్టీ, ప్రభుత్వంలో హాట్ టాపిక్‌గా మారిన విజిలెన్స్ దాడులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ కేంద్రంగా నడుస్తున్న పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందనే ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ బకాయిలు, టెండర్ల రద్దు వ్యవహారాలు దుమారం రేపుతుంటే, మరోవైపు మంత్రి ప్రమేయం లేకుండానే సీఎంవో నుంచి నేరుగా ఉత్తర్వులు వెలువడటం ప్రభుత్వంలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సన్న ధాన్యం టెండర్ల రద్దు వ్యవహారం, రైస్ మిల్లర్లపై జరిగిన విజిలెన్స్ దాడుల పర్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ముందస్తు సమాచారం లేకుండానే జరిగాయని ప్రచారం జరుగుతోంది. తన ఆధీనంలో నడుస్తున్న కీలకమైన శాఖలో తనకే గోప్యంగా ఉంచి దాడులు నిర్వహించడం, నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, తనను ఉద్దేశపూర్వకంగానే డీమోరలైజ్ చేసేందుకు కొందరు సీఎం క్యాంప్ కార్యాలయం (సీఎంవో) కేంద్రంగా కుట్ర పన్నుతున్నారని ఉత్తమ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎమ్మెల్యే పావులు.. కేబినెట్ బెర్ట్ కోసమేనా?
ఈ అంతర్గత పోరు వెనుక నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే హస్తం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ లేదా పునర్విభజన తథ్యమనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఎలాగైనా కేబినెట్‌లో బెర్ట్ దక్కించుకోవాలని సదరు సీనియర్ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిధిలోని సివిల్ సప్లైస్ శాఖలో జరుగుతున్న లోసుగులు, టెండర్లు, సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడం వంటి అంశాలను భూతద్దంలో పెట్టి నేరుగా ముఖ్యమంత్రికి చేరవేస్తున్నట్లు సమాచారం. మంత్రికి వ్యతిరేకంగా అధికారులను ఉసికొల్పుతూ, శాఖపై పట్టు కోల్పోయేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏఐసీసీ పెద్దల వరకు చేరిన పంచాయతి
శాఖాపరమైన అంశాలపై జరుగుతున్న ఈ రాజకీయం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రి హోదాలో ఉన్న తనను బలహీనపరిచేందుకు సొంత పార్టీలోనే కొందరు వ్యక్తులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం పరిణామాలపై ఆయన ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌తో పాటు పలువురు ఏఐసీసీ పెద్దలకు స్పష్టమైన ఫిర్యాదులు చేసినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో సీనియర్ మోస్ట్ మంత్రులలో ఒకరిగా ఉన్న తనకే ఈ స్థాయి అవమానం జరుగుతుంటే, భవిష్యత్‌లో పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మిల్లర్ల దాడులతో ఉమ్మడి జిల్లాలో వేల టన్నుల సీఎంఆర్ ధాన్యం మాయం కావడం, మిల్లర్లు అక్రమాలకు పాల్పడటం వంటి పరిణామాలు ఒకవైపు కలకలం రేపుతుంటే, ఈ దాడులను మరియు తనిఖీలను రాజకీయ లబ్దికోసం, ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు వాడుకుంటున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. మంత్రికి, ముఖ్యమంత్రికి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని విపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రేవంత్ వర్సెస్ ఉత్తమ్ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ఏ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

