మా పెద్దిని కాపాడండి
యశోద ఆస్పత్రిలో వైద్యులను వేడుకున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై అరగంటపాటు సమీక్ష
అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని వైద్యుల వివరణ
మరో 48 గంటలు గడిస్తేనే మెదడు స్పందనపై స్పష్టత
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం స్వయంగా పరిశీలించారు. దాదాపు 45 నిమిషాలపాటు ఆస్పత్రిలో గడిపిన ఆయన వైద్యులతో సుదీర్ఘంగా చర్చించి చికిత్స పురోగతిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పెద్ది చికిత్సలో ఎలాంటి లోటు ఉండొద్దని వైద్యులను కోరిన కేసీఆర్, “ఏం చేయాల్సి వచ్చినా చేయండి… మా పెద్దిని కాపాడండి” అంటూ భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది. ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్ నేరుగా పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతున్న ఐసీయూకు వెళ్లారు. అక్కడ వైద్యులు అందిస్తున్న చికిత్స విధానాన్ని పరిశీలించి, ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు. దాదాపు అరగంటపాటు వైద్య బృందంతో మాట్లాడిన ఆయన చికిత్సకు సంబంధించిన ప్రతి అంశంపై వివరాలు తెలుసుకున్నారు. పెద్ది ఆరోగ్య పరిస్థితిని చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మరో 48 గంటలు కీలకం
పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యాధునిక వైద్య పరికరాలతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు కేసీఆర్కు వివరించారు. అవసరమైతే అమెరికా సహా విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం గుండె, ఊపిరితిత్తులు సహా ఇతర ప్రధాన అవయవాలు పనిచేస్తున్నప్పటికీ, మెదడు స్పందనపై స్పష్టత రావడానికి మరో 48 గంటలు అవసరమని చెప్పారు. ఈలోపు ఎంఆర్ఐతో పాటు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ నిపుణుల బృందం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని వివరించారు.
వైద్యుల వివరణ విన్న అనంతరం పెద్ది చికిత్సలో ఎలాంటి లోటు ఉండకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని కోరారు. అవసరమైన ప్రతి చికిత్స అందించాలని, పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. వైద్యులను ఉద్దేశించి చేతులు జోడించి, “మీరు చేయాల్సిందంతా చేయండి… మా పెద్దిని కాపాడండి” అని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
కుటుంబానికి భరోసా
ఐసీయూ నుంచి బయటకు వచ్చిన అనంతరం కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్టతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. “దేవుడు ఉన్నాడు… డాక్టర్లు ఉన్నారు… అన్నీ బాగానే జరుగుతాయి. ధైర్యంగా ఉండండి” అంటూ భరోసా కల్పించారు. ప్రజల ప్రార్థనలు, వైద్యుల కృషితో పెద్ది కోలుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కుటుంబానికి అవసరమైన ప్రతి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్: తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులతో సుదీర్ఘంగా చర్చించి చికిత్స పురోగతిపై ఆరా తీసిన ఆయన, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “దేవుడు ఉన్నాడు.. డాక్టర్లు ఉన్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి.. గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండండి” అంటూ భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్ నేరుగా పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతున్న ఐసీయూ విభాగానికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. అక్కడ అందుతున్న చికిత్స విధానాన్ని స్వయంగా పరిశీలించి, ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తన ఉద్యమ సహచరుడిని చూసిన కేసీఆర్ భావోద్వేగానికి లోనైనట్లు అక్కడున్నవారు తెలిపారు. దాదాపు అరగంట పాటు వైద్య బృందంతో మాట్లాడి ప్రతి అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యులు పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రపంచ స్థాయి చికిత్స అందిస్తున్నామని కేసీఆర్కు వివరించారు. అవసరమైతే అమెరికా సహా విదేశాల్లోని నిపుణుల సలహాలను కూడా తీసుకుంటూ చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో అన్ని చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు.
ద్యుల వివరాల ప్రకారం, ప్రస్తుతం గుండె, ఊపిరితిత్తులు సహా ఇతర ప్రధాన అవయవాలు పనిచేస్తున్నాయి. అయితే మెదడు పూర్తిస్థాయిలో స్పందించే పరిస్థితి ఇంకా రావాల్సి ఉందని, దాని గురించి స్పష్టమైన అంచనా చెప్పాలంటే మరో 48 గంటల సమయం అవసరమవుతుందని వెల్లడించారు. ఈ మధ్యకాలంలో ఎంఆర్ఐతో పాటు అవసరమైన వైద్య పరీక్షలను నిరంతరం నిర్వహిస్తూ, నిపుణుల బృందం సమావేశమై తదుపరి చికిత్సపై నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. పూర్తి స్థాయి ఆరోగ్య సమాచారం ఇవ్వడానికి కొంత సమయం అవసరమని కూడా వివరించారు.
వైద్యుల మాటలు విన్న అనంతరం కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు. “ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ఆయనను కాపాడేందుకు పార్టీ శాయశక్తులా కృషి చేస్తుంది” అని చెప్పారు. అలాగే వైద్యులను ఉద్దేశించి, “మీరు ఏం చేయాల్సి వచ్చినా చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి” అంటూ చేతులు జోడించి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఐసీయూ నుంచి బయటకు వచ్చిన అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ట, సోదరులు శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డి, సోదరి స్వాతి తదితరులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. డాక్టర్ల కృషి, దేవుని ఆశీస్సులు, ప్రజల ప్రార్థనలతో పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన చెందవద్దని, కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
మొత్తంగా దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలో గడిపిన కేసీఆర్, వైద్యులతో చికిత్సపై చర్చించడంతో పాటు కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, మేనేజింగ్ డైరెక్టర్లు ఏఎస్ రావు, జేఎస్ రావు మాట్లాడుతూ తమ బృందం శక్తివంచన లేకుండా చికిత్స అందిస్తోందని, దేశీయ, విదేశీ నిపుణులతో సంప్రదింపులు కొనసాగిస్తూ అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని కేసీఆర్కు భరోసా ఇచ్చారు.

