వ్యూహకర్త కాదు… విజేత..!
బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం
ప్రత్యక్ష రాజకీయాల తొలి పోరులోనే ఘన విజయం
19,246 ఓట్ల మెజారిటీతో బంకీపూర్‌ను కైవసం
ఇతర పార్టీలను గెలిపించిన పీకే… ఇప్పుడు తనకోసమే ప్రజా తీర్పు
జన్ సురాజ్‌కు తొలి భారీ రాజకీయ బ్రేక్‌త్రూ
బిహార్ రాజకీయ సమీకరణాల్లో కొత్త అధ్యాయానికి నాంది
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఎన్నికల వ్యూహాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రశాంత్ కిశోర్… ఇప్పుడు ప్రజా తీర్పుతో నాయకుడిగా ముద్ర వేశారు. ఎన్నో ఎన్నికల్లో ఇతర పార్టీల విజయాలకు వ్యూహాలు రచించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగులోనే విజయఢంకా మోగించారు. బిహార్‌లోని బీజేపీకి కంచుకోటగా పేరొందిన బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,246 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. ఈ విజయంతో వ్యూహకర్తగా మాత్రమే కాదు… ప్రజా నాయకుడిగా కూడా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి దాదాపు మూడు దశాబ్దాలుగా తిరుగులేని కోట. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ మరోసారి విజయంపై ధీమాగా ఉండగా… ప్రశాంత్ కిశోర్ మాత్రం తన ప్రజా పర్యటనలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో నేరుగా బరిలోకి దిగారు. చివరకు బీజేపీకి గట్టి షాక్ ఇస్తూ విజయం సాధించారు.

మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే ప్రశాంత్ కిశోర్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొదటి రౌండ్లోనే 862 ఓట్ల ఆధిక్యం సాధించిన ఆయన… ప్రతి రౌండ్‌తో మెజారిటీని పెంచుకుంటూ వెళ్లారు. మధ్యలో ఎక్కడా ఆధిక్యం కోల్పోకుండా చివరకు 19 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ బలమైన సంస్థాగత వ్యవస్థ, సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గంలో ఈ విజయం సాధించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రశాంత్ కిశోర్ పేరు భారత రాజకీయాల్లో ఎన్నికల వ్యూహాలకు పర్యాయపదంగా మారింది. 2014లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నుంచి 2015 బిహార్ మహాఘట్బంధన్, 2019 ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, 2021 పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన స్థాపించిన ఐ-ప్యాక్ ఎన్నికల వ్యూహాలకు కొత్త దిశను చూపింది. అయితే ఇతర పార్టీలకు వ్యూహాలు రచించడం ఒక ఎత్తైతే… ప్రజల ముందుకు స్వయంగా వచ్చి ఓట్లు అడిగి గెలవడం మరో ఎత్తు. ఆ పరీక్షలో కూడా ప్రశాంత్ కిశోర్ విజయవంతమయ్యారు.
పాదయాత్ర నుంచి పార్టీ నిర్మాణం వరకు
2021 తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగకుండా బిహార్ అంతటా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. గ్రామాలు, పట్టణాలు చుట్టి ప్రజల సమస్యలను అధ్యయనం చేశారు. ఆ తర్వాత 2024 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్’ పార్టీని స్థాపించి ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో పార్టీ ప్రభావంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ… బంకీపూర్ ఉపఎన్నిక ఫలితం జన్ సురాజ్‌ను రాజకీయ చర్చల్లోకి తీసుకొచ్చింది. బంకీపూర్ విజయం కేవలం ఒక ఉపఎన్నిక ఫలితం మాత్రమే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ వంటి సంప్రదాయ పార్టీల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు కూడా అవకాశం ఉందనే సంకేతాన్ని ఈ ఫలితం ఇచ్చిందని విశ్లేషిస్తున్నారు. ప్రజల మధ్య సుదీర్ఘంగా పనిచేయడం, డేటా ఆధారిత రాజకీయాలు, క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం వంటి అంశాలు ప్రశాంత్ కిశోర్‌కు కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే ఒక నియోజకవర్గ విజయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుందా? జన్ సురాజ్ పార్టీ ఈ ఊపును నిలబెట్టుకుంటుందా? రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫలితం మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఎన్నికలు గెలిపించే వ్యూహాలు రచించిన వ్యక్తి… ఇప్పుడు అదే వ్యూహాలతో తన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్మించుకోవచ్చని ప్రశాంత్ కిశోర్ నిరూపించారు. బిహార్ రాజకీయాల్లో ఈ విజయం కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? లేక ఒక్క ఉపఎన్నిక విజయంగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

