నన్ను క్షమించండి అమ్మా, నాన్న..
మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు.. నీట్ విద్యార్థిని ఆత్మహత్య
వివాదాలతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆకాంక్ష
పేపర్ లీక్ వార్తలతో దిగ్భ్రాంతి.. తల్లిదండ్రుల కల విచ్ఛిన్నం
కూలి పని చేస్తూ.. రూ.3 లక్షల అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించిన పేద తండ్రి
నాగ్‌పూర్ : చదువుతో తమ కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలనే ఒక విద్యార్థిని కల, నీట్ పరీక్షల వివాదం కారణంగా విషాదంగా ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని ఆకాంక్ష చతుర్వేది, పరీక్షలో అక్రమాలు, పేపర్ లీకేజీ వార్తల నేపథ్యంలో తీవ్ర డిప్రెషన్‌కు లోనై నాగ్‌పూర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. నాగ్‌పూర్‌లోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న ఆమె, మే 20న తన గదిలో ఉరివేసుకుని కనిపించింది. తాజాగా లభ్యమైన ఆమె చేతిరాతతో కూడిన సూసైడ్ నోట్, ఆమె మనసులోని ఆవేదనను కళ్లకు కట్టింది. మీ కూతురు బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరిద్దరూ ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, కానీ తనకు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదని ఆకాంక్ష తన చివరి లేఖలో అమ్మానాన్నలను ఉద్దేశించి రాసింది. మొదటి ప్రయత్నంలోనే తనకు మంచి మార్కులు వస్తున్నాయని, కానీ ఇప్పుడు మళ్లీ రాస్తే మంచి మార్కులు వస్తాయనే గ్యారెంటీ లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను క్షమించండి అమ్మా, నాన్న.. నేను అంతా నాశనం చేశానంటూ ఆ లేఖలో పేర్కొంది. ఆకాంక్ష మౌగంజ్ జిల్లాలోని మగానియా గ్రామానికి చెందినది. ఆమె తండ్రి కృష్ణ కుమార్ చౌబే ఒక చిన్న రైతు. తన కూతురి చదువు కోసం ఆయన ఎంతో శ్రమించారు. చిన్న భూమిని సాగు చేయడంతో పాటు, కోచింగ్ ఫీజులు, ఇంటి ఖర్చుల కోసం ఆయన నాగ్‌పూర్‌లో వంటవాడిగా కూడా పనిచేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ ద్వారా సుమారు రూ.3 లక్షల అప్పు తెచ్చి, బంధువుల దగ్గర కూడా సాయం తీసుకుని ఆమెకు కోచింగ్ ఇప్పించారు.
లీకేజీ వార్తలతో తీవ్ర దిగ్భ్రాంతి
పరీక్ష రాసిన తర్వాత ఆకాంక్ష ఎంతో నమ్మకంతో ఇంటికి తిరిగి వచ్చిందని ఆమె బాబాయ్ జగదీష్ ప్రసాద్ చతుర్వేది తెలిపారు. పరీక్ష ముగిశాక ఆమె ఎంతో సంతోషంగా ఉందని, 650 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని తమతో చెప్పిందన్నారు. కానీ పేపర్ లీకేజీ వార్తలు రావడం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం తినడం మానేసి, ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్ర కలత చెందిందని, పరిస్థితి ఇంతవరకు వస్తుందని తాము ఊహించలేదన్నారు. పరీక్ష చుట్టూ ముసిరిన వివాదాలు, అక్రమాల ఆరోపణల వల్ల తన కష్టానికి విలువ లేకుండా పోతుందనే భయం ఆ యువ అభ్యర్థినిని తీవ్రంగా వెంటాడింది. ఈ దారుణ ఉదంతం మౌగంజ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. పోటీ పరీక్షల వివాదాలు, విద్యార్థుల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనేదానికి ఈ ఘటనే నిదర్శనమంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లకోటు వేసుకుని డాక్టర్‌గా సేవ చేయాలనుకున్న కూతురి పుస్తకాలు, నోట్స్ ఆ గదిలో అలాగే ఉన్నా.. ఆ నవ్వుల కూతురు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

