జనసేనలోకి కరాటే ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లు కృషి చేసినా గుర్తింపు లేదు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మూడు ముక్కలాట
పదవులను సినిమా టికెట్లలా పంచుకుంటున్నారు
పవన్ కళ్యాణ్ సిద్ధాంతం నచ్చి జనసేనలో చేరాను
మీడియా సమావేశంలో కరాటే ప్రభాకర్ వెల్లడి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలుగా పనిచేసినా తగిన గౌరవం, గుర్తింపు లభించలేదని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కరాటే ప్రభాకర్ రాజీనామా చేశారు. మంగళవారం వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారిందని ఆయన విమర్శించారు. కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేశానని తెలిపారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం పార్టీలో కష్టపడిన వారికి సరైన గుర్తింపు, గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారిపోయిందని ఆరోపించారు.
పదవుల పంపకం సినిమా టికెట్లలా..
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి పదవి ఇచ్చినా కనీస గౌరవం, గుర్తింపు లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారని కరాటే ప్రభాకర్ ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలో వచ్చిన పదవులను ‘నీకు ఒకటి.. నాకు ఒకటి’ అన్న చందంగా సినిమా టికెట్ల మాదిరిగా పంచుకుంటున్నారని విమర్శించారు. తనను కూడా ఎన్నో విధాలుగా ఒత్తిళ్లకు గురిచేశారని, పార్టీ కోసం కష్టపడిన వారికి విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు.
రానున్న రోజుల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జనసేనలో చేరే అవకాశం ఉందని కరాటే ప్రభాకర్ తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే జనసేనలోకి రాలేదని స్పష్టం చేశారు. పేదలకు మంచి చేయాలనే పవన్ కళ్యాణ్ దృక్పథం, సిద్ధాంతం నచ్చడంతోనే జనసేనలో చేరుతున్నానని పేర్కొన్నారు. జనసేన అధిష్ఠానం ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పనిచేస్తానని, పేద ప్రజల అభివృద్ధి కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని కరాటే ప్రభాకర్ తెలిపారు.

