కేటాయించిన ఇళ్లలో వెంటనే నివసించాలి
మౌలిక వసతులు కల్పించడంలో జాప్యం చేయొద్దు
మిగతా బ్లాక్‌లకు వారం రోజుల్లో విద్యుత్ సౌకర్యం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచన
కాకతీయ, హనుమకొండ : నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో వెంటనే నివాసం ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. సోమవారం శాయంపేటలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బ్లాక్‌లను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఇళ్ల సముదాయంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు మంజూరై, కేటాయింపు పూర్తయిన లబ్ధిదారులు ఇక ఆలస్యం చేయకుండా తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉండాలని కోరారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం నిర్మించి అందిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేటాయించిన ఇళ్లను ఖాళీగా ఉంచకుండా అర్హులైన లబ్ధిదారులు వాటిలో నివాసం ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మిగతా బ్లాక్‌లకు విద్యుత్ సౌకర్యం
శాయంపేటలో మొత్తం 19 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బ్లాక్‌లు ఉండగా ప్రస్తుతం ఆరు బ్లాక్‌లకు మాత్రమే విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. మిగతా బ్లాక్‌లకు కూడా వారం రోజుల్లోగా విద్యుత్ సౌకర్యం కల్పించేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటులో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపు పూర్తయిన వెంటనే లబ్ధిదారులు వాటిలో నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ పరిశీలనలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ్ నాయక్, ఆర్‌అండ్‌బీ ఈఈ, హౌసింగ్ ఏఈ, డీఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.

