యూపీపైనే కమలనాథుల గురి!
జాతీయ కార్యవర్గంలో ఆ రాష్ట్రానికి పెద్దపీట
తెలంగాణకు ఒక్కరికీ దక్కని చోటు
ఓబీసీ మోర్చా పగ్గాలు అమర్‌పాల్ మౌర్యకు
స్మృతి ఇరానీ, హరీష్ ద్వివేదికి కీలక బాధ్యతలు
నాన్‌యాదవ్ ఓబీసీలను మళ్లీ తమవైపు తిప్పుకునే వ్యూహం
రెండువేల ఇరవై ఏడులో యూపీ ఎన్నికలే టార్గెట్?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ కూర్పులో ఉత్తర్‌ప్రదేశ్‌కు దక్కిన ప్రాధాన్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పరిమిత సంఖ్యలో కీలక పదవులను భర్తీ చేసిన జాతీయ బృందంలో యూపీకి ఏకంగా ఎనిమిది మందికి ప్రాధాన్యం కల్పించగా.. తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రూపొందించిన కొత్త బృందంలో యూపీకి చెందిన హరీష్ ద్వివేది, స్మృతి ఇరానీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, భోలా సింగ్, సంగీతా యాదవ్ జాతీయ కార్యదర్శులుగా, రేఖా వర్మ, డాక్టర్ తారిఖ్ మన్సూర్ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య, మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కున్వర్ వాషిత్ అలీకి బాధ్యతలు అప్పగించారు. పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గంలో యూపీకి ఇంతటి ప్రాధాన్యం కల్పించడం వెనుక రెండువేల ఇరవై ఏడులో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
యూపీ ఎన్నికలే అసలు లెక్క
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బీజేపీ ఇప్పటి నుంచే రాజకీయ కసరత్తు ప్రారంభించినట్లు కొత్త జాతీయ కార్యవర్గ కూర్పు స్పష్టం చేస్తోంది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన యూపీలో సామాజిక సమీకరణాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో పార్టీ నాయకత్వం ముందుగానే వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఓబీసీ వర్గాల్లో పార్టీకి ఉన్న పట్టు మరింత బలోపేతం చేయడంతోపాటు రెండువేల ఇరవై నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యూపీ నుంచి ఎనిమిది మందికి కీలక పదవులు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు, రాజకీయ వర్గాలకు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మౌర్య, కుష్వాహ, శాక్య, సైని వంటి ప్రభావవంతమైన వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడంలో భాగంగానే అమర్‌పాల్ మౌర్యను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అమర్‌పాల్ మౌర్యకు కీలక బాధ్యత
తెలంగాణకు చెందిన డాక్టర్ కే. లక్ష్మణ్ స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమర్‌పాల్ మౌర్యకు జాతీయ ఓబీసీ మోర్చా పగ్గాలు అప్పగించడం కొత్త కూర్పులో అత్యంత కీలక పరిణామంగా భావిస్తున్నారు. యూపీ రాజకీయాల్లో కేశవ్‌ప్రసాద్ మౌర్య తర్వాత మౌర్య సామాజిక వర్గానికి చెందిన జాతీయ స్థాయి నేతగా అమర్‌పాల్ మౌర్య ఎదిగిన నేపథ్యంలో ఆయన నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో యూపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అమర్‌పాల్ మౌర్య ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. యూపీలో నాన్‌యాదవ్ ఓబీసీ వర్గాలను తిరిగి బీజేపీ వైపు సమీకరించడంలో ఆయన కీలకంగా పనిచేస్తారని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండువేల ఇరవై నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీ వర్గాల్లో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు బీజేపీకి ఆందోళన కలిగించాయి. యాదవులు సమాజ్‌వాదీ పార్టీకి అండగా నిలవగా.. యాదవేతర ఓబీసీలలోని కొంత వర్గం బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఈ సమీకరణాన్ని మరింత బలోపేతం చేయడమే ఇప్పుడు పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
పీడీఏ వ్యూహానికి కౌంటర్?
సమాజ్‌వాదీ పార్టీ రెండువేల ఇరవై నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో పీడీఏ పేరుతో వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను ఒకే రాజకీయ వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ వ్యూహం బీజేపీకి కొంత మేరకు నష్టం కలిగించింది. ముఖ్యంగా ఓబీసీ వర్గాల్లో వచ్చిన మార్పులు కమలనాథులను పునరాలోచనలో పడేశాయి. దీంతో చేజారిన వర్గాలను మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం సామాజిక సమీకరణాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే అమర్‌పాల్ మౌర్యకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మౌర్యతోపాటు కుష్వాహ, శాక్య, సైని తదితర నాన్‌యాదవ్ ఓబీసీ వర్గాలను సమీకరించేందుకు ఆయనకు జాతీయ స్థాయి బాధ్యతలు ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూపీ ఎన్నికల్లో ఓబీసీ ఓటుబ్యాంకు కీలకం కానుండటంతో ఈ నియామకం వెనుక రాజకీయ లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్మృతి ఇరానీకి జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం
కేంద్ర మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం కూడా కొత్త బృందంలో మరో కీలక అంశంగా మారింది. రెండువేల పంతొమ్మిది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె పార్టీలో మంచి వక్తగా పేరుగాంచారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమె రాజకీయ అనుభవాన్ని యూపీతోపాటు దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూపీకి చెందిన హరీష్ ద్వివేదికి కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు దక్కాయి. యువ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సంగీతా యాదవ్‌కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు. భోలా సింగ్, రేఖా వర్మ, డాక్టర్ తారిఖ్ మన్సూర్, కున్వర్ వాషిత్ అలీకి కూడా కీలక బాధ్యతలు ఇవ్వడంతో యూపీలోని వివిధ సామాజిక, రాజకీయ వర్గాలను సమన్వయం చేసే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తోంది.
తెలంగాణకు ప్రాతినిధ్యం కరవు
కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి కూడా చోటు దక్కకపోవడం రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలంగాణకు చెందిన డాక్టర్ కే. లక్ష్మణ్ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగగా.. ఇప్పుడు ఆ బాధ్యతను యూపీకి చెందిన అమర్‌పాల్ మౌర్యకు అప్పగించారు. దీంతో జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కుతున్న ప్రాధాన్యంపై కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ప్రస్తుత కూర్పును పూర్తిగా యూపీ రాజకీయ అవసరాల కోణంలోనే చూడాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో బీజేపీ ముందుగానే అక్కడి రాజకీయ సమీకరణాలను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జాతీయ కార్యవర్గంలో యువతకు కూడా ప్రాధాన్యం కల్పించారు. నలభై ఏళ్ల లోపు వయసున్న వారు ఆరుగురు ఉండగా.. నలభై నుంచి నలభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న వారు పదిహేను మంది ఉన్నారు. యాభై నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న వారు ఇరవై ఒక్క మంది ఉన్నారు. అనుభవంతోపాటు యువతకు ప్రాతినిధ్యం కల్పించేలా బృందాన్ని రూపొందించినట్లు ఈ కూర్పు స్పష్టం చేస్తోంది. మొత్తంగా కొత్త జాతీయ కార్యవర్గంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు దక్కిన ప్రాధాన్యం వెనుక రెండువేల ఇరవై ఏడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాన్‌యాదవ్ ఓబీసీ వర్గాలను తిరిగి బీజేపీ వైపు సమీకరించడంతోపాటు పీడీఏ వ్యూహానికి దీటుగా సామాజిక సమీకరణాలను బలోపేతం చేయడంపై పార్టీ దృష్టి పెట్టినట్లు కొత్త నియామకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు ఒక్కరికీ చోటు దక్కకపోవడం మాత్రం రాష్ట్ర బీజేపీలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.

