పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై నల్లబెల్లిలో నిరసన
బంద్‌కు మద్దతుగా స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత
మాధవరెడ్డి దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, నల్లబెల్లి: నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట అర్ధరాత్రి దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నల్లబెల్లి మండలంలో మంగళవారం స్వచ్ఛంద బంద్ పాటించారు. బీఆర్‌ఎస్ శ్రేణుల పిలుపుతో వ్యాపారులు దుకాణాలు మూసివేసి నిరసనకు మద్దతు తెలిపారు. నర్సంపేట అభివృద్ధికి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలను గుర్తించి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని బీఆర్‌ఎస్ నాయకులు, అభిమానులు పేర్కొన్నారు. ఆయన సతీమణి పెద్ది స్వప్న విగ్రహం తొలగింపుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణించి నెల రోజులు కూడా పూర్తికాకముందే విగ్రహాన్ని తొలగించడం కలచివేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. నిరసనకు సిద్ధమైన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటి ముందు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

