నకిలీ బంగారంతో ఫైనాన్స్ సంస్థకు టోకరా
ముగ్గురు నిందితుల అరెస్ట్.. సీసీఎస్ పోలీసుల చర్యలు
11 నకిలీ బంగారు ఉంగరాలు స్వాధీనం
35.8 గ్రాముల ఆభరణాలు.. విలువ సుమారు రూ.4 లక్షలు
మరో ఇద్దరు పరారీ.. గాలింపు కొనసాగింపు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా చూపించి ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాకు ఖమ్మం సీసీఎస్ పోలీసులు చెక్ పెట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీసీఎస్ సీఐ ఎస్. రాజ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు నకిలీ బంగారు ఆభరణాలను సిద్ధం చేసుకుని వాటిని అసలైన బంగారంగా చూపిస్తూ నగరంలోని ముత్తూట్ గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. ఈ కేసులో ఇసంపల్లి సాయివంశీ (34), షేక్ మహబూబ్ (33), జూపల్లి రాము (35)లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 11 నకిలీ బంగారు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు 35.8 గ్రాములు కాగా, విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. కాగా ఈ కేసులో కొక్కిరేణి సందీప్ (27), ముండాడ రామచందర్ (39) పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో చురుకుగా పనిచేసిన ఎస్ఐ వంశీ, హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హరి, జానీ, నరసింహారావు, శ్రీధర్, సతీష్ తదితరులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

