సుస్మిత పటేల్ వ్యాఖ్యలపై జంగా రాఘవరెడ్డి ఫైర్
సీఎం రేవంత్, ఎమ్మెల్యే రేవూరిపై వ్యాఖ్యలు సరికాదు
పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం తగదు
రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. వ్యక్తిగత దూషణలు వద్దు
వాస్తవాలను ప్రజల ముందుంచాలి
రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండ సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు సరికావని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. పూర్తి సమాచారం లేకుండా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ కూడా తనకు తెలియకుండా ఆ వ్యాఖ్యలు జరిగాయని వివరణ ఇచ్చినట్లు తెలిపారు. రాజకీయాలు ఉండాలని, అయితే వ్యక్తిగత విమర్శలు, తప్పుడు ప్రచారానికి తావుండకూడదని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం కంటే వాస్తవాలను ప్రజల ముందుంచాలని జంగా రాఘవరెడ్డి సూచించారు. రాజకీయ అంశాలపై విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పులేదని, అయితే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సుదర్శన్‌రెడ్డి మృతిని రాజకీయంగా వాడొద్దు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని జంగా రాఘవరెడ్డి అన్నారు. సుదర్శన్‌రెడ్డి మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన.. హరీశ్‌రావు, కేటీఆర్ చేస్తున్న రాజకీయ ప్రచారం వల్ల ఆయనకు రావాల్సిన సానుభూతి దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై దొంతి మాధవరెడ్డి రోహిణి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు సహకరించారని పేర్కొన్నారు. ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోయి బీఆర్‌ఎస్ నాయకులు దొంతి మాధవరెడ్డి ఫొటోతో శవయాత్ర నిర్వహించడం సరికాదన్నారు. దొంతి మాధవరెడ్డి కాకుండా ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలిచేలా నర్సంపేట ప్రజల తీర్పు ఉంటుందని వ్యాఖ్యానించారు.
వైఎస్‌ఆర్ నగర్ భూముల్లో ప్రజా ప్రయోజన నిర్మాణాలు
కాజీపేటలోని వైఎస్‌ఆర్ నగర్ కాలనీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని జంగా రాఘవరెడ్డి తెలిపారు. కాలనీలోని భూమిని ప్రభుత్వ భూమిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి గుర్తించారని చెప్పారు. కాలనీ వాసులు కొందరు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని, స్పందించిన నాయిని.. ఎవరైనా దాడి చేసినా, బెదిరించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారని తెలిపారు. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ భూముల్లో ప్రభుత్వ ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, బస్‌స్టాప్, ఏసీపీ కార్యాలయం వంటి ప్రజాప్రయోజన నిర్మాణాలు చేపట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాంట్రాక్టర్లతో లాలూచీ పడి సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. నాయిని రాజేందర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధిని కొందరు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జంగా రాఘవరెడ్డి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

