ఏసీబీ వలలో రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పాలనాధికారి
పట్టాదారు పాస్‌బుక్ పనికి లంచం డిమాండ్..
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కాకతీయ,శంకరపట్నం:కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామాన్ని నిర్వహిస్తున్న గ్రామ పాలనాధికారి (జీపీఓ) తహసిల్దార్ కార్యాలయంలో గురువారం రోజు సాయంత్రం కాంపేటి శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టాదారు పాస్‌బుక్‌కు సంబంధించిన పనిని చేయించుకునేందుకు ఫిర్యాదుదారుడు జీపీఓ శ్రీనివాస్‌ను సంప్రదించగా, అందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. మొదట రూ.15 వేలు డిమాండ్ చేసి, అనంతరం మరో రూ.5 వేలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారుడు మొత్తం రూ.20 వేల లంచం ఇచ్చేందుకు అంగీకరించగా, ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. జీపీఓ శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం జీపీఓను అరెస్టు చేసి కరీంనగర్ న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

