‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్
గ్రాస్‌రూట్ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం
2026–31 కాలానికి రూ.29,054 కోట్ల కేటాయింపు
తెలంగాణలో 33 ఖేలో ఇండియా కేంద్రాలు
కొత్త పథకంతో క్రీడారంగం మరింత బలోపేతం: జ్వాలా గుట్టా
కాకతీయ, హైదరాబాద్ : పునరుద్ధరించిన ‘ఖేలో ఇండియా’ పథకం భారత క్రీడారంగ స్వరూపాన్ని మార్చే గేమ్‌చేంజర్ అని ఒలింపియన్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుట్టా అన్నారు. గ్రాస్‌రూట్ స్థాయి నుంచే ప్రతిభను గుర్తించి క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు క్రీడల్లో నిలకడకు ప్రాధాన్యం ఇవ్వడం ఆశాజనకమన్నారు. 2026–31 కాలానికి పథకానికి రూ.29,054 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత కేటాయింపులతో పోలిస్తే ఇది సుమారు ఎనిమిది రెట్లు అధికమని, సహాయం పొందే క్రీడాకారుల సంఖ్యను పది రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గ్రాస్‌రూట్ నుంచి ఒలింపిక్ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కోచ్‌ల బోర్డు, అకాడమీల బలోపేతం, మౌలిక వసతులు, స్పోర్ట్స్ టెక్నాలజీకి నిధులు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో ప్రతిభ గుర్తింపు వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే 33 ఖేలో ఇండియా కేంద్రాలు పనిచేస్తున్నాయని, వాటిలో 601 మందికి పైగా క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 19 ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీలు ఉన్నాయని వెల్లడించారు.

