ప్రజావాణి దరఖాస్తులకు ఫస్ట్ ప్రయారిటీ
కలెక్టర్ సత్య శారద ఆదేశం
145 వినతులు స్వీకరణ రెవెన్యూ, బల్దియా, హౌసింగ్ సమస్యలే అధికం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా సత్య శారద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 145 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూ శాఖకు 42, జీడబ్ల్యూఎంసీకి 26, హౌసింగ్ కు 14, డీఆర్డీవోకు 14, ఇతర శాఖలకు 49 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు ఎండార్స్ చేస్తూ, సమగ్రంగా పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ సమస్యపై వచ్చిన వినతులను పరిశీలించిన కలెక్టర్, టైలరింగ్ లో ప్రావీణ్యం ఉన్న వారికి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మండలాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తోందని, పెన్షన్ వంటి సమస్యలపై ప్రజలు అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వి.గణేష్, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, డీఎంహెచ్ వో డా రాజారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

