గిరిజన సంక్షేమ శాఖలో శ్రీనివాసుడి లీలలు
నచ్చితేనే ఫైల్ క్లియర్.. అన్ని అర్హతలున్నా క్లియరెన్స్‌కు వేధింపులు
నిబంధనలతో పనిలేకుండా అధికారి వ్యవహారం
రాజకీయ అండదండలున్నాయంటూ డిపార్ట్‌మెంట్‌లో హల్‌చల్
సార్ సర్టిఫైడ్ కోసం నెలలుగా వేచి చూస్తున్న ఉద్యోగుల ఫైళ్లు
బిల్లుల క్లియరెన్స్‌కు బ్రోకర్లతో వెళ్తేనే పని పూర్తయ్యేది..!
గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న అధికారి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో ఓ అధికారి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ కొన్ని ఫైళ్లను కొర్రీల పేరుతో పెండింగ్‌లో పెడుతున్నారని ఉద్యోగులు, సంబంధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. తనకు నచ్చిన ఫైళ్లను మాత్రమే వేగంగా క్లియర్ చేస్తూ.. మిగిలిన వాటిని నెలల తరబడి తిప్పుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘సార్ సర్టిఫైడ్’ కోసం ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందన్న ఆరోపణలు శాఖలో హాట్‌టాపిక్‌గా మారాయి. శాఖలో ఉద్యోగులు, క్షేత్రస్థాయి అధికారులు తమకు సంబంధించిన బిల్లులు, సర్వీస్ వ్యవహారాలు, ఇతర పరిపాలనాపరమైన ఫైళ్లను నిబంధనల ప్రకారం సిద్ధం చేసి ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపుతుంటారు. అయితే కొన్ని ఫైళ్ల విషయంలో చిన్నచిన్న కారణాలు చూపుతూ వాటిని వెనక్కి పంపుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఒకసారి చెప్పిన లోపాన్ని సరిచేసి మళ్లీ పంపినా మరో కారణంతో కొర్రీ పెట్టడం, ఇలా ఫైళ్లను రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు, అధికారులు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది. నిబంధనల్లో స్పష్టత ఉన్న అంశాల్లోనూ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మధ్యవర్తుల ద్వారా వస్తేనేనా?
బిల్లుల క్లియరెన్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు, ధ్రువపత్రాలు సమర్పించినప్పటికీ నేరుగా వచ్చిన ఫైళ్లపై ఆలస్యం చేస్తున్నారని.. మధ్యవర్తులు, బ్రోకర్ల ద్వారా సంప్రదించిన తర్వాతే పనులు సులువుగా పూర్తవుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఏ ఫైలు ఎప్పుడు వచ్చింది? ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉంది? ఏ కారణంతో కొర్రీ పెట్టారు? తిరిగి సమర్పించిన తర్వాత ఎంత సమయంలో క్లియర్ చేశారు? అన్న వివరాలను ఫైల్ మూవ్‌మెంట్ రికార్డుల ద్వారా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
రాజకీయ అండ ఉందా?
సదరు అధికారికి రాజకీయ అండదండలు ఉన్నాయన్న ప్రచారం కూడా శాఖలో జరుగుతోంది. అందువల్లే ఉన్నతాధికారుల స్థాయిలోనూ ఆయన వ్యవహారశైలిపై పెద్దగా చర్యలు ఉండటం లేదన్న చర్చ ఉద్యోగుల్లో సాగుతోంది. రాజకీయ పలుకుబడి లేకపోతే ఇంతకాలం ఒకే అధికారి కార్యాలయంలో చక్రం తిప్పడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయి. కమిషనర్ కార్యాలయంలో ఫైళ్ల పరిష్కారానికి స్పష్టమైన గడువు ఉన్నప్పటికీ.. ఆచరణలో మాత్రం ఆలస్యం జరుగుతోందన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సార్ సర్టిఫైడ్, బిల్లుల క్లియరెన్స్, ఉద్యోగుల సర్వీస్ ఫైళ్లను ప్రత్యేకంగా పరిశీలిస్తే ఎక్కడ ఆలస్యం జరుగుతోందో తేలే అవకాశం ఉంది. గత కొన్ని నెలల్లో సదరు అధికారి వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల సంఖ్య, వాటిలో ఎన్ని క్లియర్ అయ్యాయి, ఎన్ని తిరస్కరించారు, ఎన్ని కొర్రీలతో వెనక్కి పంపారు అనే వివరాలను బయటకు తీస్తే అసలు వ్యవహారం స్పష్టమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఆరోపణలు నిరాధారమైతే రికార్డులతో వాటిని ఖండించాలి.. నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని శాఖ వర్గాలు కోరుతున్నాయి. మొత్తంగా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో సాగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఫైళ్ల పరిష్కారానికి పారదర్శక విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది.

