23,757 జీడీఎస్ పోస్టులతో నోటిఫికేషన్
నేటి నుంచే వన్‌టైమ్ రిజిస్ట్రేషన్
తెలంగాణ, ఏపీలోనూ భారీగా పోస్టులు
సెప్టెంబర్ 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
10వ తరగతి అర్హత..! రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక
పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ శుభవార్త అందించింది. తపాలా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్–2026కు సంబంధించి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 23,757 జీడీఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ గణనీయ సంఖ్యలో పోస్టులు ఉన్నట్లు వెల్లడించారు. ఇండియా పోస్ట్ అధికారిక జీడీఎస్ పోర్టల్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 19, 2026 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రక్రియ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్ 21, 2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఎడిట్/కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
పదో తరగతి అర్హత ఉంటే చాలు..
జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్‌లో పాస్ మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేస్తున్న పోస్టుకు సంబంధించిన స్థానిక భాషను కనీసం పదో తరగతి వరకు చదివి ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌వుమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకపోవడం. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. దాని ఆధారంగానే అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ తయారీలో మార్కులను 4 డెసిమల్ పాయింట్ల వరకు పరిగణనలోకి తీసుకుంటారు.

